ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై మెల్లగా చర్చ ప్రారంభమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేసి.. క్షేత్ర స్థాయి కార్యచరణ ప్రారంభించారు. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. వైసీపీ అధినేత జగన్.. స్థానిక ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వరించకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. లోక్‌సభ ఉపఎన్నికను మాత్రం ఆపలేరు. కరోనా అని మరోకటని కారణం చెప్పలేరు. అలా చెప్పే చాయిస్ కూడా లేదు. అందుకే… ఎన్నికను ఎదుర్కోవాల్సిందే. ఈ కారణంగా అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల ముఖ్యులతో జగన్ సమావేశం అయ్యారు.
తిరుపతి లోక్‌సభ పరిధిలో ప్రస్తుత పరిస్థితి… పార్టీల బలాబలాలపై చర్చించారు. అయితే.. ప్రస్తుతం వైసీపీ ఇంకా బలపడిందని.. ప్రతిపక్షాలు ఇంకా బలహీనపడ్డాయని… గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా వస్తుందని పార్టీ నేతలు…జగన్‌కు సూచించారు. చిత్తూరు జిల్లాలో భారీ మెజార్టీ తెస్తానని మంత్రి పెద్దిరెడ్డి జగన్ కు హామీ ఇచ్చారు. నెల్లూరు బాధ్యతలను కూడా తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరుండాలన్నదానిపై జగన్ సమాలోచనలు జరిపారు. ఎవరైనా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే.. వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయిన బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి లేదా.. భార్యకి టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లు వస్తాయని లెక్కలేసి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. వేరే ఆలోచనలో ఉన్నారు. తనకు ఫిజియోథెరపిస్ట్ గా చేసిన ఓ డాక్టర్ కు టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
టిక్కెట్‌ను బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకు కాకుండా ఇతరులకు ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని జగన్ మరో విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడంతో… ఇతర నేతలు సైలెంటపోయిపోయారు. అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఇచ్చినా గెలిపించి తీసుకు వస్తామని జగన్ కు హామీ ఇచ్చి బయటకు వచ్చారు. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఇద్దామని.. జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికైతే ఏ విషయాన్ని ఖరారు చేయలేదు. కానీ జగన్ మాత్రం.. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని.. వైసీపీలో ఓ అభిప్రాయానికి వచ్చేశారు.