ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవే. 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలు చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.
అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు
గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రాథమికంగా వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సాధారణంగా అసెంబ్లీ జరుగుతూంటే అన్ని పార్టీల నేతలు .. తమ పార్టీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తాయి.కానీ జగన్ అలాంటి పద్దతులకు వ్యతిరేకం. తాను ఏం చెబితే ఎమ్మెల్యేలు అది చేయాలని అంతకు మించి ఒక్క పని కూడా చేయవద్దని సంకేతాలు ఇచ్చి సభలోకి తీసుకు వెళ్తారు. ఒక్క రోజే జగన్ సభకు హాజరవుతారా లేకపోతే.. సమావేశాలు మొత్తం హాజరవుతారా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అనర్హతా వేటు పడకుండా ఒక్క రోజు మాత్రం హాజరవడం ఖాయంగా కనిపిస్తోంది.
గౌరవం లభించలేదని గందరగోళం చేయడం ఖాయం !
జగన్ మోహన్ రెడ్డి తన రేంజ్ ను ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మాత్రమే. దానికి తగ్గట్లుగా ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రితో సమానంగా తనకు గౌరవం కావాలని..భద్రత కావాలని ఆయన హడావుడి చేస్తూంటారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ అదే జరిగే అవకాశం ఉంది.
బీఏసీ సమావేశానికి హాజరవుతారా ?
అసెంబ్లీకి వస్తున్న జగన్ గవర్నర్ ప్రసంగం వింటారు. తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయన కూడా అందులో సభ్యుడే. అయితే జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశానికి వస్తే చంద్రబాబుతో ఎదురెదురుగా కూర్చోవాలి. పక్కన అచ్చెన్నాయుడు కూడా ఉంటారు. అందుకే .. ఆయన ధైర్యం చేయకపోవచ్చునని.. బీఏసీ సమావేశానికి వెళ్లరని అంటున్నారు. అదే సమయంలో సీనియర్ నేతను అయినా పంపుతారా అన్నది సస్పెన్స్ గా మారింది.