ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల తరవతా ఈవీఎంలను ఎలా సపోర్టు చేశారో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తనకు ఫలితాలు అనుకూలంగా రాకపోయే సరికి .. ఈవీఎంల మీద నిందలేస్తున్నారు.
ఈవీఎంలపై నమ్మకం లేదు కాబట్టి ఇక నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా ఈవీఎంలు వాడితే మాత్రం.. ఎన్నికలు బహిష్కరిస్తే మంచిదన్న సలహాలు ఆ పార్టీకి వస్తున్నాయి. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలపై బోలెడంత నమ్మకం ఉంటే… ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నేతలతో డ్రామాలాడిస్తున్నారు.
ఈవీఎంలపై ఓడిపోయిన ప్రతి ఒక్కరికీ అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ అధినేత కూడా ఈవీఎంలపై పోరాడారు. అప్పట్లో వైసీపీ నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు వారే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం కన్నా ఈవీఎంలతో నిర్వహించే ఎన్నికలన్నింటినీ బహిష్కరించడం ద్వారా నిరసన వ్యక్తం చేస్తే .. వాటిపై అనుమానాలున్న ఇతర పార్టీలు కూడా కలసి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.