జగన్ పాదయాత్రపై తెలుగుదేశం ముందస్తు దాడిని ఖండించేవారు కూడా ఆయన మరో నిర్ణయాన్ని ఆమోదించడం లేదు. వాస్తవానికి వైఎస్ఆర్సిపిలో కూడా ముఖ్యమైన నాయకులూ అధికార ప్రతినిధులు అధినేత నిర్ణయం జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వీర విమర్శకుడైన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ బహిష్కరణ నిర్ణయం సరికాదని సూటిగా చెప్పేశారు. ఇక సిపిఎం నాయకులు రాఘవులు మధు వంటి వారు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. టీవీ చర్చలకు వచ్చే వైసీపీ ప్రతినిధులు కొందరు ఈ నిర్ణయంపై తమ దగ్గర వాదన లేదని చేతులెత్తేస్తున్నారు. వెళ్లినా అవకాశం వుండదు కదా అని మాత్రం అంటున్నారు. వచ్చే ఏడాదితో ఎన్నికల జ్వరం మొదలవనుంది. ఆ విధంగా చూస్తే ఇప్పుడు జరిగేవి గాక మరొక దఫా సమావేశాలకు మాత్రమే ఎక్కువ వ్యవధి విలువ వుంటాయి.రాజధాని కాంట్రాక్టులు పోలవరంతో సహా అనేక కీలకాంశాలు రానున్నాయి. ఇలాటి తరుణంలో సభను బహిష్కరించడం అంటే చంద్రబాబు నెత్తిన పాలుపోయడం కాదా అని వైసీపీ నేతలు మధనపడుతున్నారు. పైగా దీనివల్ల రాజకీయంగా తప్పు సంకేతాలు వెళతాయనే ఆందోళన వారిలో వుంది. తను లేకుండా సభలో మరొకరిని నాయకత్వం అప్పగించేందుకు చర్చలు జరగనిచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని ప్రజలు భావిస్తారని వారు అంటున్నారు. ఇప్పటికే సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఈ నిర్ణయంపై దాడి చేశారు.సభ పట్ల గౌరవం లేదన్న తరహాలో మాట్లాడారు. అయితే జగన్ దీనిపై సమీక్ష పున: పరిశీలన జరిపే అవకాశం మాత్రం కనిపించడం లేదు.