పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతి అనే రాజధాని ఉందని ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా.. అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. గత శనివారం .. సీఆర్డీఏ అధికారులను తీసుకుని ఓ సారి కొంత భాగాన్ని పరిశీలించిన బొత్స.. మళ్లీ సోమవారం.. ఆ పరిశీలనను కొనసాగించారు. రెండురోజుల పాటు పర్యటన సాగినా.. ఇంకా కొంత మిగిలిపోయింది. మళ్లీ వస్తానని అధికారులకు చెప్పారు. అసలు బొత్స ఎందుకు పర్యటిస్తున్నారో ఉన్నతాధికారులకు కూడా క్లారిటీ లేదు. అయితే.. మరో ఏడాది పాటు అయినా… రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనుకుంటున్న ప్రభుత్వం.. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలనుకుంటోందన్న సమాచారం మాత్రం.. ప్రభుత్వ వర్గాల నుంచి బయటకు వస్తోంది.
బొత్స పర్యటన ఇప్పుడు సాగుతోంది కానీ.. ముఖ్యమంత్రి కూడా పనులపై సమీక్షించారని కొద్ది రోజుల కిందట.. ప్రభుత్వం నుంచి కొన్ని వర్గాల మీడియాలకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాలపై సమీక్ష చేశారని… 70శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయమని సూచించారని.. ఆ సమీక్షా సమావేశ సారాంశం. అధికారం చేపట్టినప్పుడు.. అమరావతిలో అంతా అవినీతే.. అవినీతిని వెలుగులోకి తెచ్చి… ఆ తర్వాత నిర్మాణాలు చేపడతామన్నారు. అప్పట్నుంచి అనేక మలుపులు తిరిగింది అమరావతి వ్యవహారం. అవినీతి అని పేరు చెబుతూ.. పాత కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు. నిర్మాణాలు శిధిలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం… 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టిపెట్టినట్లుగా బయటకు చెబుతున్నారు.
అమరావతిలో 70 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేస్తే.. ఉద్యోగులందరికీ క్వార్టర్స్ లభిస్తాయి. ఎమ్మెల్యేల క్వార్టర్లు వస్తాయి. ప్రభుత్వం నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ లభిస్తాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. వాటిని పూర్తి చేస్తే.. విశాఖను వైజాగ్ తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే.. అక్కడ మళ్లీ అన్నీ కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అమరావతిలో అన్నీ అందుబాటులో ఉంటే.. అక్కడకు ఎందుకు అన్న చర్చ వస్తుంది. అది రాకుండానే అమరావతిలో ఏమీ లేదు అని చెప్పడానికే.. నిర్మాణాలు నిలిపివేశారని అంటూంటారు. అయితే ఇప్పుడు మళ్లీ కడతామని అంటున్నారు. ఇందులో రాజకీయం ఉందో.. లేక నిజంగానే కడతారో.. కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.