‘వంచనపై గర్జన’… ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా ఈ పేరుతో అప్పుడప్పుడూ సభలు నిర్వహిస్తోంది. ఈనెల 30న కూడా ఇలాంటి సభ నిర్వహణకు సిద్ధమైంది. కాకినాడలో ఈ సభ ఉంటుందని, ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అడ్డుపడుతూ వ్యవహరించాయో ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం అన్నారు. యువకులు, మేధావులు, రాజకీయ పార్టీలన్నింటికీ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ గర్జన సభల్ని విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇంతవరకూ నాలుగు సభలు జరిగాయి. కాకినాడలో జరగబోయేది ఐదోది. గత సభలన్నీ విజయవంతం అయ్యాయని వైకాపా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ, ఆ సభల ద్వారా సాధించింది ఏంటనేది మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు..! ఆ విజయం ఏంటనేది వైకాపా కూడా వివరంగా విశ్లేషించి చెప్పలేని పరిస్థితి. పోనీ, ఈ సభలు పార్టీకి ప్రచారపరంగా ఏమైనా మైలేజ్ ఇస్తున్నాయా అంటే… అదీ కనిపించడం లేదు. ఎందుకంటే, వంచనపై గర్జన సభలకు ముందుగానీ, సభల తరువాతగానీ ప్రత్యేక హోదా గురించి పార్టీపరంగా కార్యక్రమాలేవీ ప్రముఖంగా నిర్వహించడం లేదు. ఈ సభల కొనసాగింపు ఏరూపంలోనూ ఉండదు. సభ జరిగే ఆ ఒక్కరోజు మాత్రమే వైకాపా నేతలు ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. దీనికి ముందుగానీ, తరువాతగానీ… ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా హోదా అంశాన్ని ప్రముఖంగా తన పాదయాత్రలోనైనా ప్రస్థావించడం మానేశారు. కేంద్రంపై విమర్శలు ధైర్యంగా ఘాటుగా చెయ్యలేకపోతున్నారు.
నిజానికి, ఏపీ ప్రత్యేక హోదా అంశమై వంచన చేసింది కేంద్రంలోని భాజపా సర్కారు. కానీ, వైకాపా గర్జన అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎక్కువగా ఉంటుంది. ఇంతగా గర్జిస్తున్నామని అనుకుంటున్న వైకాపా.. ఈ సభల విషయమై ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. వీటి ప్రయోజనం ఏంటనేది కనీసం వారైనా తెలుసుకోవాల్సి ఉంది. ప్రత్యేక హోదా కోసం వైకాపా ప్రయత్నం… ఎంపీల రాజీనామాలతోనే చల్లారిపోయిందనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం చేసినా.. జాతీయ స్థాయిలో ఏపీ హోదా సాధనకు ఆ పార్టీ గళమెత్తుతోందన్నంత సౌండ్ రావడం లేదు. అందుకే, ఆ సభలకు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. కనీసం కాకినాడ సభలోనైనా కొత్త పంథా అనుసరిస్తారా… లేదంటే, గడచిన నాలుగు సభల మాదిరిగానే కొన్ని విమర్శలకే పరిమితం అవుతారా అనేది చూడాలి. ఏదేమైనా, ప్రత్యేక హోదా సాధనకు వైకాపా ప్రయత్నం ఎప్పుడో ముగిసిపోయిందన్నది వాస్తవం.