జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. అయితే మద్దతిస్తారా.. పోటీ చేస్తారా.. జేడీఎస్ సీట్లు కేటాయిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే వీరితో సంబంధం లేకుండానే.. వైసీపీ కూడా.. తాము కూడా కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని సంకేతాలు పంపుతోంది. బళ్లారి రీజియన్‌లో పోటీకి వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది. అక్కడ గాలి జనార్ధన్ రెడ్డి వైసీపీ బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో కీలక నేత. కానీ ఆయనకు ఇప్పుడు ప్రాధాన్యం లభించడం లేదు. ఆయన అనుచరుడు శ్రీరాములు మంత్రిగా ఉన్నారు. కానీ తమదైన సీట్లు చేతిలో ఉంటే తప్ప బీజేపీ తమ మాట వినదని వారు అనుకుంటున్నారు. గతంలో గాలి బ్యాచ్ మొత్తం.. బీజేపీని వీడినప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నారు. దాని పేరు బీఎస్ఆర్ కాంగ్రెస్. అటు జగన్ కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు.. దాని పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్. కన్నడలో గాలి పార్టీ పేరు యువజన, రైతు, శ్రామిక కాంగ్రెస్ పార్టీనే. అంటే పరస్పర అవగాహనతోనే పార్టీలు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ అవగాహన తెరపైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పేరుతోనే కర్ణాటకలో గాలి బ్యాచ్ మొత్తం పోటీ చేసే చాన్స ్ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే జగన్..గాలి జనార్ధన్ రెడ్డి చర్చలు కూడా జరిపారని కర్ణాటకలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటకలో ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ ఉంటారు. ఎలాగో రాయలసీమలో వైసీపీకి బలం ఎక్కువ. కాబట్టి కర్ణాటకలో వైసీపీకి ఆదరణ వస్తుందని భావిస్తున్నారట. అక్కడ బీజేపీ-కాంగ్రెస్-జేడిఎస్‌ల మధ్య పోరు జరుగుతుంది..అక్కడ రాజకీయంగా స్పేస్ తక్కువ. మరి గాలి జనార్దన్ రెడ్డి… జగన్ ద్వయం ఏం చేస్తారో ?