తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్.. ఒక్క సారిగా వెనక్కిపోయింది. తెలంగాణలో టీడీపీ, వైఎస్ఆర్సీపీలను ఆంధ్రాపార్టీలన్న ముద్రను టీఆర్ఎస్ నేతలు వేశారు. ఇప్పుడు ఆంధ్రా పార్టీల్లేవు.. లోకల్ పార్టీల్లేవు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. మీరెలా మా రాష్ట్రానికి వస్తారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించలేరు. గడ్డు పరిస్థితులు ఎదురైనా టీడీపీ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం పూర్తిగా వదిలేసింది. ఇప్పుడు ఏం చేస్తుందనేది కీలకం.
వైఎస్ఆర్సీపీకి కూడా తెలంగాణలో ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఏం చేస్తుందన్నది సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో పోటీ చేస్తారా లేకపోతే జగన్ సోదరి పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మద్దతిస్తారా అన్నది స్పష్టత లేదు. ఇప్పటికైతే… బీఆర్ఎస్ ఏపీలోకి రావడంపై స్పందించారు కానీ.. తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టడంపై వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. షర్మిల కూడా అన్న మద్దతు ఇస్తారని ఆశలు పెట్టుకోనట్లుగా కనిపిస్తోంది. అన్న కోసం తాను చాలా చేశానని తన కోసం ఏమైనా చేస్తారేమోనని ఆశించడం స్వార్థం అవుతుందని ఆమే ఢిల్లీలో నిర్వేదం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే జగన్కు ఉన్న భయభక్తుల వల్ల వైసీపీ తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని పూర్తిగా వదిలేసిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని.. కేసీఆర్ అనుమతిస్తేనే రంగంలోకి దిగుతారని అంటున్నారు. తెలంగాణలో యాక్టివ్గా రాజకీయాలు చేయడం కానీ బహిరంగంగా చెల్లికి మద్దతు ప్రకటించడం కానీ చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండిపోయింది.