వైకాపా పిలుపు మేరకు మంగళవారం ఏపి బంద్ జరిగింది. దానికి ప్రతిపక్ష పార్టీలనీ మద్దతు ఇచ్చాయి. బంద్ విజయవంతం అయ్యిందని ప్రతిపక్ష పార్టీలు, విఫలం అయ్యిందని తెదేపా ప్రకటించుకొన్నాయి. ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. యధాప్రకారం తనివితీరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించిన తరువాత ఆయనకి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే చిత్తశుద్ధి లేదని స్పష్టం అయిపోయింది కనుక, దానిని సాధించే బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంటులు కోరామని, అవి దొరికితే మళ్ళీ డిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేయమని వారిని కోరుతామని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఓసారి ఇలాగే ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, బంద్, ఆమరణ నిరాహార దీక్ష అంటూ చాలా హడావుడి చేశారు. కానీ అర్దాంతరంగా ముగించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఆయనని సభా ముఖంగా గట్టిగా నిలదీసి అడిగే అవకాశం ఉన్నప్పటికీ, మర్యాదలు సరిపోలేదనే వంకతో ఆ సభకి మొహం చాటేశారు. ఆ తరువాత ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపడేసి వేరే అంశానికి షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ ఇంతకాలానికి దాని గురించి మాట్లాడుతున్నారు. హడావుడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని చెపుతున్నారు. కానీ ఈసారి ఎన్ని రోజులు చేస్తారో ఆయనకే తెలియాలి.
జగన్ ఈ మధ్యనే చాలా ఆర్భాటంగా గడపగడపకి వైకాపా అనే కార్యక్రం ప్రకటించారు. దానిని పక్కన పడేసి ప్రత్యేక హోదాని అందుకొన్నారు. కనుక పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ప్రత్యేక హడావుడి చేసి, వేరే అంశానికి షిఫ్ట్ అయిపోవచ్చు. తెదేపా ప్రభుత్వం ఎలాగూ మచిలీపట్నం భూసేకరణ సిద్దం అవుతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో మిగిలిన ఆరు గ్రామాలలో భూసేకరణ చట్టం క్రింద రైతుల నుంచి భూసేకరణ చేయబోతోంది. వాటిపై ప్రభుత్వంతో పోరాటం మొదలుపెడితే ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు టైం సరిపోదు. కనుక మళ్ళీ పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదలయ్యే వరకు ప్రత్యేక పోరాటాలు వాయిదా వేసుకోక తప్పదు.