రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తును పక్కనపెట్టే స్థాయికి టీడీపీ వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైనా కూడా మోడీ సర్కారుపై టీడీపీ ఎంపీలు విమర్శలు చేశారు. గడచిన నాలుగు రోజుల్లో తీవ్రమైన ప్రయత్నాలు చేసి.. కొంతమేరకు కేంద్రాన్ని కదిలించగలిగారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై బడ్జెట్ లో ఎలాంటి ఊసూ లేకపోయినా, టీడీపీ చేసిన ప్రయత్నంతో కొన్ని స్పష్టమైన హామీలు కేంద్రం ఇచ్చింది. సరే, వాటిని నిలబెట్టుకోకపోతే వచ్చే నెల 5 నుంచి మరోసారి పోరాటానికి దిగేందుకు వెనకాడేది లేదన్నట్టుగానే టీడీపీ నిర్ణయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీ మద్దతుగా నిలవకపోయినా ఫర్వాలేదుగానీ… టీడీపీపై ఢిల్లీలో విమర్శలు చేస్తుంటే ఏమనుకోవాలి..? కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదనీ, ఆయన రాజీనామా చేసి మాట్లాడాలంటూ లా పాయింట్లు తీశారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి.
విభజన హామీలపై పోరాడాల్సింది పోయి, కేంద్రమంత్రి సుజనా చౌదరి మీద ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతిని వైకాపా ఎంపీ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విభజన హామీలు నెరవేరలేదన్నది వాస్తవమేననీ, కానీ వీటిపై నిరసన తెలిపే హక్కు సుజనా చౌదరికి లేదని విజయసాయి రెడ్డి వాదించారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ, రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత, అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రంతో సుజనా చౌదరి పోరాడాలంటే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మండలి నిర్ణయాలను మంత్రులు విమర్శించకూడదు అంటూ ఆర్టికల్ 74 గురించి సభలో మాట్లాడారు. అయితే, ఈ పాయింటాఫ్ ఆర్డర్ ను రాజ్యసభ ఛైర్మన్ తోసిపుచ్చారు. దీంతో ఆయన రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీతో సంబంధం లేని పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీ ఎంపీలకు మద్దతు పలుకుతున్న పరిస్థితి. కానీ, సొంత రాష్ట్రంలోని ప్రతిపక్షం తీరు ఇలా ఉంది. కేంద్రమంత్రి నిరసన వ్యక్తం చేయడం సరికాదంటే ఎలా..? ఆయన సొంత ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదు కదా! అయినా, కేంద్రాన్ని విమర్శిస్తే… మంత్రులు అలా మాట్లాడకూడదూ అనే లా పాయింట్లు తీసేదీ వీరే. కేంద్రాన్ని ఏమీ అనకపోతే… అదిగో మంత్రి వర్గంలో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదనీ విమర్శించే నోళ్లూ అవే..! చేస్తుంటే చేయకూడదంటారు… చేయకపోతే చేయలేదంటారు. సుజనా చౌదరి మీద ఫిర్యాదు చేసే బదులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై రాష్ల్రపతికి విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినా కొంత బాగుండేది. అంతేగానీ… క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు ప్రశ్నించకూడదు అనే లాజిక్ లు తవ్వి తెచ్చుకుని మాట్లాడటానికి ఇది సందర్భమా..? ఇలాంటి సందర్భంలో కూడా వైకాపాది ఫక్తు రాజకీయ లబ్ధి బుద్ధి అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.