రాజకీయాలు డైనమిక్ గా అనూహ్యంగా మలుపు తిరుగుతూ ఉంటాయి. నిన్న మొన్నటి దాకా తిరుగు లేదన్నట్లుగా ఉన్న వైఎస్ఆర్ సిపి కి దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
2019 ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించి 151 స్థానాలలో గెలుపొంది, ప్రభుత్వాన్ని స్థాపించిన వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ తర్వాత కూడా విజయాలు కొనసాగుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇక తమకు ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి పార్టీ ఎంతగానో నమ్మే ప్రశాంత్ కిషోర్ టీం తాజా సర్వే రిపోర్ట్ ను వైయస్ జగన్ కి అందించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టు ప్రకారం దాదాపు 100 స్థానాలలో వైఎస్ఆర్సిపి తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోడం తోపాటు, పలు వర్గాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరక పోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ వంద స్థానాల్లోనూ జగన్ ప్రభుత్వం మీదే కాకుండా వైఎస్ఆర్ సీపీ నేతల పట్ల స్థానికంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పట్ల ఆశ్చర్యం ప్రకటించినట్లు సమాచారం. ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని తాము కూడా భావించామని, ప్రతిపక్షాలు ఏకం కాకుండా, కూటమి కట్టకుండా చూసుకో గలిగితే మరొకసారి తమ గెలుపు ఖాయం అన్న అంచనాలతో ఉన్నామని, కానీ ఈ తాజా రిపోర్ట్ తమను తాము మరొకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని కల్పించిందని వైఎస్ఆర్సిపి ఈ నేతలు ఈ రిపోర్ట్ మీద స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమో అన్నది వేచి చూడాలి.