రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రివర్గంలో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతోందని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఏపీకి చోటు లేదు. బీజేపీ తరపున ఎంపీలు కూడా ఎవరూ లేరు. టీడీపీ నుంచి బీజేపీ లో విలీనం అయిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎంరమేష్, టీజీ వెంకటేష్ ఉన్నారు. కానీ వారి విశ్వసనీయతపై బీజేపీ హైకమాండ్‌కు నమ్మకం లేదు. దీంతో వారికి పదవి ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత నమ్మకస్తులైన మిత్రులు దూరమయ్యారు.
శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత… అకాలీదళ్ మొన్న వ్యవసాయ బిల్లులు పాస్ చేసిన తర్వాత గుడ్ బై చెప్పేశాయి. ఇప్పుడు… ఎన్డీఏలో బీజేపీ తప్ప.. గట్టిగా ఉనికి చాటే మరో పార్టీ లేదు. దీంతో కొత్త మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కి ఈ మేరకు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది ఈ ఆఫర్‌పైనే చర్చించడానికని చెబుతున్నారు. ఓ కేబినెట్ మంత్రి పదవి ఇస్తే ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని వైసీపీ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అనేక కారణాల రీత్యా ఇప్పుడు వైసీపీకి బీజేపీతో బహిరంగంగగా సంబంధం పెట్టుకోక తప్పని పరిస్థితి ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే కేంద్రం నుంచి రూపాయి సాయం రాకుండా ఎలా ఎన్డీఏలో చేరుతారన్న విమర్శలు వస్తాయి. దీని కోసం కేంద్రంతో గతంలో టీడీపీ హయాంలో ఇస్తామని చెప్పిన తాయిలాల ప్యాకేజీని మరోసారి అటూఇటూ తిప్పి ప్రకటించేసి.. భారీ సాయం చేసిందని…అందుకే బీజేపీతో జట్టు కడుతున్నామని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎన్డీఏలో వైసీపీ చేరిక ఖాయమన్న చర్చ మాత్రం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.