ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి రాజ్యసభ ఎన్నికలు గండంగా మారాయి. క్లియర్ మెజార్టీ ఉన్నా ఎమ్మెల్యేలను నిలుపుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. అప్పుడే తాము ఇంకో ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచేవాళ్లమని టీడీపీ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసలు, వైవీ సుబ్బారెడ్డి పేర్లును వైసీపీ ఖరారు చేసింది. కానీ వీరు ముగ్గురూ గెలుస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
టీడీపీ ఒక్క సీటు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగే, రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్ ఇస్తామని అంటుంది టీడీపీ. కాగా.. రాజ్యసభ స్థానం దక్కాలంటే కనీసం 45 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని టీడీపీ అంచనా వెస్తోంది. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ భిన్నంగా ఉంటుంది. ఇటీవల చాలా మంది టీడీపీతో టచ్ లోకి వచ్చారు. ఇంకా దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని లెక్కలు వేసుకుంటుంది. అయితే ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ చెబుతుంది.
రిజర్వుడు నియోజకవర్గాలు, బీసీ ఎమ్మెల్యేల సీట్లనే జగన్ రెడ్డి ఇప్పటి వరకూ మార్చారు. వారంతా అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ ఎస్సీ అభ్యర్థిని నిలబెడితే..ఆ పేరుతో వారంతా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముందు పెట్టుకుని బలం ఉన్నా కూడా ఓ రాజ్యసభ స్థానాన్ని కోల్పోతే వైఎస్ఆర్సీపీ నైతికంగా ముందే ఓడిపోయినట్లవుతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశంపై టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఎంత మందిని తగ్గించినా.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలే అభ్యర్థిని గెలిపించే పరిస్థితి ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. టిక్కెట్ల కసరత్తు విషయంలో ఎమ్మెల్యేల్ని బుజ్జగించే విషయంలో పెడసరంగా వ్యవహరించడం.. సరైన గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శల తరుణంలో టిక్కెట్ రాని వారు ఇక పార్టీతో సంబంధం ఏమిటన్న స్థితికి వస్తున్నారు. ఐదో జాబితా రిలీజ్ చేస్తే పరిస్థితి మరింత దిగజారనుంది.