వైకాపా నేత బొత్స సత్యనారాయణ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేశారు. తనపై ఏదో కుట్ర చేస్తున్నామని చంద్రబాబు భయపడుతున్నారనీ, అది కుట్ర కాదనీ వాస్తవాలనీ బొత్స అన్నారు. ఈ రాష్ట్రంలో ఏవిధంగా అవినీతి జరుగుతోందో, ఎలా దోచుకుని తింటున్నారో అన్నీ ముఖ్యమంత్రికి తెలుసు అని వ్యాఖ్యానించారు. ‘మీరు చేసిన ప్రతీ దోపిడీని, అవినీతి కార్యక్రమాన్నీ మాటలతో చెప్పడం కాదు, కొద్ది రోజుల్లో పుస్తక రూపంలో తీసుకురాబోతున్నాం’ అని ప్రకటించారు.
ఆ పుస్తకాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ, అందరు నాయకులకీ అందించబోతున్నామన్నారు. వైకాపా నాయకులంతా స్వయంగా దేశమంతటా పర్యటించి, అన్ని పార్టీలకూ ఈ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారనీ, ఆర్థికంగా ఎదగనీయకుండా చేశారనీ స్వయంగా చెప్పబోతున్నాం అన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్షంగా ఉండమని ఓటిచ్చారనీ, మిమ్మల్ని అధికారంలో ఉండమని అధికారమిచ్చారనీ బొత్స అన్నారు. పాలనాపరంగా ఏదైనా అవినీతి జరిగితే, ఏదైనా తప్పు జరిగితే బాధ్యతగల ప్రతిపక్షంగా దాన్ని ప్రజలకు తాము చెప్పాలనీ, సంబంధింత ఏజెన్సీలకు విన్నవించాలన్నారు. చట్టబద్ధంగా పోరాటం చేస్తూ ప్రజలకు ఆసరాగా ఉండటం తమ బాధ్యత అని బొత్స గుర్తు చేసుకున్నారు!
అవినీతిపై పుస్తకాలేసి, అన్ని పార్టీల నాయకులకూ పంచితే ఏం జరుగుతుంది..? వాటితో దేశవ్యాప్త పర్యటన వల్ల ఏం ఉపయోగం..? ఏపీ ప్రజలకు ఆ పుస్తకాలు ఏరకంగా ఉపయోగపడతాయి..? గతంలో కూడా పుస్తకాలేశారే.. ఏం జరిగింది..? అయినా, పుస్తకాలేసేంత సమాచారం వారి దగ్గర ఉన్నప్పుడు… వాటితో న్యాయ పోరాటానికి నేరుగా దిగితే బాగుంటుంది! అప్పుడు పనిగట్టుకుని అన్ని పార్టీలను కలుసుకునే శ్రమ కూడా తగ్గుతుంది. ప్రతిపక్ష పార్టీగా న్యాయ పోరాటం కూడా తమ బాధ్యత అని బొత్స గుర్తు చేసుకున్నారు. ఆ పనేదో ముందే చేయాలి. అంతేగానీ… సీఎంపై ఆరోపణలున్నాయి, ఆయన చేసిన అవినీతికి సంబంధించిన సమాచారం ప్రింటింగ్ కి ఇచ్చాం అంటే ఎలా..? అంటే, ఆరోపణల పేరుతో కేవలం ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశమే వైకాపా పోరాటంలో కనిపిస్తోంది. అది కూడా పార్టీకి రాజకీయంగా ఉపయోగపడేలా మాత్రమే వారి ఆరోపణలూ తీరూ ఉంటున్నాయి. తెల్లారితే చాలు అవినీతీ అంటూ చాలా చెబుతారు. ఆధారాలతో ఎందుకు మాట్లాడరు..? ఓహో.. ఆధారాలు ఇవ్వాలంటే సీబీఐ ఎంక్వయిరీ వేసుకోవాలని మొన్ననే విజయసాయి రెడ్డి చెప్పరు కదా.