నంద్యాల ఓటమి దెబ్బతో వైకాపా శ్రేణులు ఒకింత డీలా పడిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం కాకినాడలో కొంత కనిపించింది. అయితే, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ల శిక్షణ, ఆ తరువాత ఇంటింటికీ ప్రచారం.. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, ఈసారి ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను గుర్తించే ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే, వైయస్ హయాంలో రైతుల్లో మాంచి అభిమానం ఉండేది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజాదరణకు నోచుకున్నాయి. ఎంతోమంది లబ్ధిపొందారు. నిజానికి, జగన్ ను అభిమానించేవారిలో ఎక్కువమంది వైయస్ అభిమానులే ఉంటారు. ఆయన వారసుడిగా జగన్ ఆదరణ పొందుతున్నారు.
అందుకే, ముందుగా రాష్ట్రంలో ఇంటింటికీ తిరుగుతూ వైయస్సార్ అభిమానులతో ఒక జాబితా రూపొందించాలని అనుకుంటున్నారు. దీనికోసమే ‘వైయస్ ఫ్యామిలీ’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వైయస్ అంటే అభిమానం ఉన్న కుటుంబాలను గుర్తిస్తారు. ఆ తరువాత, వైకాపా కార్యకర్తల వివరాలను కూడా సేకరిస్తారట. ఈ జాబితా అంతా తయారు అయిన తరువాత, ప్లీనరీలో ప్రకటించిన నవరత్న హామీలను ముందుగా వీరికి వివరిస్తారట. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉండగా తమకు ఏయే ప్రయోజనాలు దక్కాయో, వైకాపా అధికారంలోకి వస్తే అంతకుమించిన లబ్ధి ఉంటుందనే భరోసాను ముందుగా వీళ్లలో నింపాలనేది వ్యూహంగా తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైయస్ రాజశేఖర్ రెడ్డి లెగసీపైనే పూర్తిగా ఆధారపడబోతున్నారు!
సంస్థాగతంగా వైకాపాకి ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ ను సృష్టించుకోవడానికి ఈ సెంటిమెంట్ ప్రయోగం కొంతవరకూ ఉపకరించే అవకాశం ఉంది. కానీ, 2019 ఎన్నికలకు వచ్చేనాటికి ప్రజల ప్రాథమ్యాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. జగన్ కు ఓటు వెయ్యాలంటే వైయస్ పై ఉన్న అభిమానం ఒక్కటే కొలమానంగా సరిపోదేమో అనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే, ఆయన లెగసీ ప్రభావం ఎంత ఉన్నా… ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది కదా. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రుల్లో ఒకరకమైన అభద్రత నెలకొంది! ఆంధ్రాకు అన్నివిధాలుగా అన్యాయం జరిగిందనీ, సత్వర అభివృద్ధి జరగాలనీ, యువతకు ఉపాధి సౌకర్యాలు పెరగాలనీ, సంక్షేమం ఉండాలనీ.. ఇలాంటి అంశాలు కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబట్టిన అంశాలూ ఇవే. మరో ఏడాదిన్నరలో రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే అంశాలు ప్రాతిపదిక అవుతాయి.
వైయస్ అభిమానుల కుటుంబాలు కూడా తమ బిడ్డల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాయి కదా. వైయస్ పై ఉన్న అభిమానాన్ని జగన్ కి ఓటు వేయడం ద్వారా వ్యక్తీకరిస్తే… నాకు దక్కే ప్రయోజనం ఏంటనే ఆలోచన కొంత శాతమైనా వారిలో ఉండే అవకాశం ఉంటుంది. జగన్ కేవలం వైయస్ వారసుడిగానే కాకుండా… ఆంధ్రా అభివృద్ధికి ప్రత్యామ్నాయ సారధిగా కూడా కనిపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వైయస్ లెగసీ అనేది అదనపు ప్రయోజనంగా భావిస్తే మేలు!