భారతీయ జనతా పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్లుగా పని చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ ప్రెస్‌మీట్ పెట్టినా… గత టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శించి… ప్రస్తుత ప్రభుత్వాన్ని మాత్రం పైపైన విమర్శిస్తూంటారు. ప్రభుత్వంపై ఏ తరహా విమర్శలు వచ్చినా అదే ప్లాన్ అమలు చేస్తూంటారు. ఆలయాలపై దాడుల ప్రస్తావన వస్తే… పుష్కరాల సమయంలో గుళ్లు కూలగొట్టించారంటారు..అప్పులు చేస్తున్నారంటే చంద్రబాబును మించి చేస్తున్నారని పోలికలు తెస్తారు.. ఇప్పుడు రూ. 41వేల కోట్ల గోల్ మాల్ విషయంలోనూ జీవీఎల్ నరసింహారావు అదే పాట పాడుతున్నారు. టీడీపీ హయాంలో కూడా జరిగాయని.. ఇప్పుడు వైసీపీ కూడా చేసిందని.. బ్యాలెన్స్ చేసేందుకు తన ప్రయత్నాలు చేస్తున్నారు.
జీవీఎల్ నరసింహారావు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. టీడీపీ హయాంలో కూడా పీడీ ఖాతాల్లోకి నగదు మళ్లించి దుర్వినియోగం చేశారనే అంశంపై దర్యాప్తు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంపై గవర్నర్ క ుటీడీపీ నేత.. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. దానిపై రాజకీయంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో గతంలో టీడీపీ ప్రభుత్వంపై జీవీఎల్ నరసింహారావు చేసిన విమర్శలు కూడా హైలెట్ అయ్యాయి. టీడీపీ హయంలో కాగ్ కానీ.. మరో రాజ్యాంగ సంస్థ కానీ అకౌంటింగ్ గురించి తప్పు పట్టకపోయినా జీవీఎల్ వచ్చి.. అందులో ఉన్న సొమ్మేదో టీడీపీ నేతలు దోచేసినట్లుగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అంతకు మించి ఫ్రాడ్ కనిపిస్తూండటంతో మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించినట్లుగా భావిస్తున్నారు.
టీడీపీ హయాంలో కాగ్ నివేదికలు రెగ్యులర్‌గా వచ్చేవి. వాటిని అసెంబ్లీలో పెట్టేవాళ్లు. పీడీ ఖాతాలు అయినా.. మరో ఖాతా అయినా ఎక్కడా అవకతవకలు జరిగాయన్న విమర్శలు రాలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో రూ. 41వేల కోట్లను అనధికారికంగా చెల్లించారన్న విమర్శలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడంతో ప్రభుత్వం తడబడుతోంది. ఏదో తప్పు జరిగిందన్న అభిప్రాయానికి అందరూ వచ్చేలా ప్రభుత్వమే చేస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రతిపక్షంగా ప్రజాధనం విషయంలో… బాధ్యత కలిగిన… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా స్పందించాల్సింది పోయి గత ప్రభుత్వం గురించి ప్రస్తావన చేసి.. వైసీపీ సమస్యను తక్కువ చేసేందుకు జీవీఎల్ ప్రయత్నాలు చేయడం.. చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.