విజయసాయిరెడ్డి చెప్పిన మాటలకు షర్మిల ఆవేశ పడి జగన్ క్యారెక్టర్ ను జీరోను చేసేశారు. ఇప్పుడు ఆమె మాటలకు కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక వైసీపీ కిందా మీదా పడుతోంది. నేరుగా జగన్ స్పందించలేరు. అలా స్పందిస్తే షర్మిల ఇంత కాలం ఎదురు చూస్తున్న అవకాశాన్ని కల్పించినట్లే అవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడటం లేదు. షర్మిలకు కౌంటర్ ఇవ్వాలంటే కుటుంబం నుంచే అయి ఉండాలి. పార్టీ నేతలతో తిట్టించలేరు. తిట్టించడానికి అభ్యంతరం లేదు కానీ ఆమెకు సానుభూతి వస్తుందని ఆగుతున్నారు.
మామూలుగా అయితే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వంటి వారు తెరపైకి వచ్చేవారు. విజయసాయిరెడ్డి ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఆయన గేమ్ లో భాగంగానే ఇదంతా జరుగుతోంది. సుబ్బారెడ్డిని తెర ముందుకు తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పదే పదే ఆస్తుల గురించి మాట్లాడలేనని ఆయన అంటున్నారు. దీంతో షర్మిల చేస్తున్న డ్యామేజ్ ను కవర్ చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఇప్పటికే తల్లి, చెల్లికి రాసిచ్చేసిన ఆస్తులను తిరిగి ఇవ్వాలని ఎప్పుడైతే ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేశారో అప్పుడే ఆయనకు భవిష్యత్ లో కూడా అంచనా వేయనంత నష్టం జరుగుతుందని తేలిపోయింది. ఇప్పుడు అదే వెంటాడుతోంది.
షర్మిల ఇప్పుడు తన ఆస్తులు అనడం లేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, మనవరాలు.. జగన్ మేనల్లుడు, మేనకోడళ్ల ఆస్తుల్ని కాజేస్తున్నారని అంటున్నారు. ఇది జగన్ ఎంత క్యారెక్టర్ లెస్ అన్నది ప్రజల ముందు ఉంచుతోందని వైసీపీ క్యాడర్ ఆవేదన. ఎంతో సంపాదించుకున్న జగన్.. తన చెల్లికి వాటాలు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో వారికి అర్థం కావడం లేదు. రాజకీయ పదవులు ఆమె ఆశించలేదు.. అన్యాయం చేయబట్టే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలకు కనీసం కౌంటర్ ఇచ్చే వారు కూడా లేరని వైసీపీ నేతలు దిగులు చెందుతున్నారు.