ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో… పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.. మిగిలినవి బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థి పంచుకున్నారు. ఫలితంగా మెజార్టీ 82 వేల దగ్గర ఆగిపోయింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు ، బీజేపీకి) 19,352 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 4,179 ఓట్లు పడ్డాయి. లక్ష మెజారిటీ కోసం మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలంతా ఆత్మకూరులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ లక్ష మెజారిటీ ఆశలపై నీళ్లు చల్లింది. నిజానికి మేకపాటి కుటుంబం కాస్త దృష్టి పెట్టి ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ వైసీపీ హైకమాండ్ ఉప ఎన్నిక జరగాలని లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేసింది. సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారం చేశారు. ఓట్లు పడవు అనుకున్న చోట్ల డబ్బులు కూడా పంచారు. అయితే లక్ష్యం మాత్రం అందుకోలేదు.
బద్వేలులోనూ అంతే జరిగింది. తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగినప్పుడు వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అప్పుడు టీడీపీకి లక్ష ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని రెండు సార్లు చాన్సులు వచ్చినా అందుకోలేకపోవడం వైసీపీలోనూ నిరాశ వ్యక్తమవుతోంది. అయితే.. భారీ వ్యతిరేకత ఉందని విపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో ఈ మాత్రం ఓట్లు రావడం చాలా గొప్ప అని వైసీపీలోని కొన్ని వర్గాలు సంతృప్తి పడుతున్నాయి.