ప్రతిపక్ష నేత జగన్ బుద్ధిని ‘సాక్షి’ పత్రిక మరోసారి బయటపెట్టుకుంది..! రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు సంకట స్థితిలో ఉన్న ఈ తరుణంలో కూడా.. రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తోంది. సాక్షి మెయిన్ ఎడిషన్ లో ‘హోదాకి అడ్డు ఎవరు?’ అంటూ ఓ కథనం ప్రచురించారు. ఇంకెవరు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డు అని వారు నిరూపిస్తారన్నది ఆ శీర్షిక చూడగానే అర్థమైపోతుంది. హోదా కోసం అలుపెరని పోరాటం చేస్తున్నది ప్రతిపక్ష నేత జగన్ ఒక్కరు మాత్రమే అని ఈ కథనం నిరూపిస్తుందన్నదీ అర్థమైపోతుంది. భాజపా ప్రస్థావన ఉండదనేదీ చెప్పాల్సిన అవసరం లేని అంశం.
ఈ కథనం సారాంశం ఏంటంటే… ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఎన్ని విమర్శలు వస్తున్నా చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు..? హోదా కంటే ప్యాకేజీ చాలా గొప్పది అని చంద్రబాబు ఎందుకు మెచ్చుకున్నారు..? 14వ ఆర్థిక సంఘంలో హోదా ఇవ్వకూడదన్న అంశమే లేదన్న విషయం చంద్రబాబుకు ఇప్పుడే తెలిసిందా..? ఈ ప్రశ్నలతోపాటు, ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచీ జగన్ పోరాడుతూ ఉంటే… ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చంద్రబాబు చేశారని కూడా కథనంలో చెప్పారు. వీటన్నింటికంటే ఇంకా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తమౌతున్న నిరసనలూ మేధావుల సదస్సులూ జరుగుతున్న సమావేశాలూ రోడ్లమీదకు వస్తున్న ప్రజలు… ఇవన్నీ జగన్ పోరాట ఫలితమే అంటూ ఆ క్రెడిట్ ను వైకాపా ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేశారు.
వాస్తవం మాట్లాడుకుంటే… కేంద్ర బడ్జెట్ అద్భుతం అని మెచ్చుకున్నది వైకాపా మాత్రమే. ఏపీకి అన్యాయం జరిగిందని మొదట గళమెత్తిందే టీడీపీ ఎంపీలు. ఆ తరువాత, రాష్ట్రంలో ఆందోళన తీవ్రతరమైంది. తెలుగుదేశం ఇచ్చిన స్ఫూర్తితో ఇతర ప్రజా సంఘాలుగానీ, ఇతర పార్టీలుగానీ, ఆ మాటకొస్తే వైకాపాకి కూడా చీమ కుట్టింది ఆ తరువాతనే! జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి, కేంద్రం తీరుపై విమర్శలు చేసిన తరువాత వైకాపాలో స్పందన వచ్చింది. ఆ స్పందన కూడా ఎలాంటిదంటే… ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యతిరేకించడమే! ఆయన తాకట్టుపెట్టేశారూ ఆయన అమ్మేశారూ.. ఇదో ధోరణిలో జగన్ మాట్లాడుతూ వచ్చారు. అంతేగానీ, ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై ఇంతవరకూ పల్లెత్తిమాటన్నదే లేదు. ఇంతటి సుదీర్ఘ కథనంలో కూడా ఎక్కడా భాజపా తీరుపై ఘాటుగా విమర్శించిన సందర్భం వెతికినా కనిపించదు..!
ఈ కథనం ద్వారా వారు బయటపెట్టుకున్న అంశం ఏంటంటే… ప్రత్యేక హోదా తమతోనే సాధ్యమనీ, తాను ముఖ్యమంత్రి కాగానే హోదా తెచ్చేస్తానంటూ జగన్ చెబుతూ ఉన్నారు. ‘హోదాపై పోరాటం’ అంటే తమకు మాత్రమే పేటెంట్ ఉన్న రాజకీయాంశంగా దాన్ని మార్చేశారు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హోదా గురించి మాట్లాడేసరికి… అరెరే, మనకి మైలేజ్ ఇచ్చే అంశాన్ని ఆయన లాక్కెళ్లిపోతున్నారే అనే ఆందోళనతో కూడిన ఆవేదనతో నిండిన రాజకీయ లబ్ధి బుద్ధిని ఈ కథనం బయటపెడుతోంది.
అయితే, ఇక్కడ వారు గుర్తించాల్సిన మరో అంశం… ప్రత్యేక హోదా ఇకపై ఎవ్వరికీ ఉండదని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసిన అంశం నిజమే. కానీ, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయమేంటీ… ఇప్పటికే హోదా ఉన్న రాష్ట్రాలకు ఆ స్టేటస్ కాలపరిమితిని కేంద్రం పెంచింది. అంటే, హోదా కాల పరిమితిని పెంచుకునే వెలుసుబాటు ఉన్నప్పుడు, మనకు హక్కుగా ఇస్తామన్న హోదాపై పునరాలోచించే అవకాశం ఉంటే పరిశీలించాలనే అంశాన్ని కేంద్రం ముందు పెట్టాలని టీడీపీ సర్కారు భావిస్తోంది. ఈ విషయాన్ని తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా వైకాపా మార్చుకుంటోంది. ఇంతకీ… గడచిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా కోసం వైకాపా ఏం చేసిందో చెప్పరేం..?