అమరావతికి ఏక థమ్ మద్దతు ప్రకటించిన సోము వీర్రాజు వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. నిన్నటిదాకా ఆయన రాజధాని అమరావతిలో ఉండటం వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉండేవారు. కానీ అనూహ్యంగా మాట మార్చేశారు. అమరావతిలో రాజధాని కుండబద్దలు కొడుతున్నారు. అంతటితో వదిలి పెట్టడం లేదు.. ఏపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతో వైసీపీ ఉలిక్కి పడింది. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉన్నప్పుడు.. కూడా ఇలాంటి ప్రకటనలే చేసేవారు. దాంతో ఆయనపై వైసీపీ ఓ రకంగా యుద్ధం ప్రకటించింది. ఆయన చంద్రబాబు ట్రాప్‌లో ఉన్నారని.. చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించేవారు.
ఇక అమరావతికి మద్దతుగా ఎవరు మాట్లాడినా వారిపై కుల ముద్ర వేయడం కామన్‌గా జరుగుతోంది. ఇప్పుడు సోము వీర్రాజు విషయంలో ఎలా స్పందించాలో.. వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు చేసే వారిపై చెలరేగిపోయే వైసీపీ నేతలు.. సోము వీర్రాజుపై మాత్రం సాఫ్ట్‌గా స్పందించారు. సోము వీర్రాజు బీజేపీ మేనిఫెస్టో చదువుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు. అందులో హైకోర్టును కర్నూలులో పెడతామని ఉందని ఆయన చెబుతున్నారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అమరావతికి సోము వీర్రాజు నిధులు తీసుకొస్తే సంతోషిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే రాయలసీమకూ తీసుకు రావాలని ఆయన అంటున్నారు.
కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయనపై చూపించినంత దూకుడు ప్రస్తుతం సోము వీర్రాజుపై వైసీపీ నేతలు చూపించలేకపోతున్నారు. ఆయనపై టీడీపీ ముద్ర.. కుల ముద్ర వేయలేకపోతున్నారు. ముందు ముందు అమరావతికి ఇంకా హార్డ్‌కోర్‌గా సోము వీర్రాజు సపోర్ట్‌గా మాట్లాడితే.. ఏమైనా మార్పు వస్తుందేమో కానీ.. ఇప్పుడు మాత్రం.. కంట్రోల్ పాటిస్తున్నారు.