విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం.. తమ ఆత్మగౌరవ సమస్యగా వైసీపీ భావిస్తోంది. గురువారం చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత తొలి సారి వెళ్తూండటంతో.. వైసీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనివ్వబోమని మంత్రి అవంతి అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు జన సమీకరణ చేస్తున్నారు. పేదలకు స్థలాలు ఇవ్వకుండా… అడ్డుకునేందుకు చంద్రబాబు వస్తున్నారని.. లబ్దిదారులకు చెప్పి.. వారందర్నీ… చంద్రబాబు సభ వద్దకు తీసుకు రావాలని.. సందేశాలు పంపుతున్నారు.
పెందుర్తి ఎమ్మెల్యే ఇలా పేదల్ని తీసుకు రావాలంటూ పార్టీ నేతలను ఆదేశించిన వాట్సాప్ సందేశం వైరల్ అవుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోకపోతే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా.. అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతుందని వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. అందుకే.. చంద్రబాబును అడ్డుకోవడం.. తమ ఇజ్జత్ కా సవాల్‌గా భావిస్తున్నారు. వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా.. టీడీపీ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే పర్యటనకు మరింత ప్రాధాన్యత వస్తుందని భావిస్తున్నారు.
విశాఖలో చంద్రబాబు వైసీపీ నేతల భూబాగోతాలను బయట పెడతానని ప్రకటించారు. ఇవి బయటకు వస్తాయనే.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని టీడీపీ ప్రచారం చేయాలనుకుంటోంది. అదే సమయంలో.. నేతల్ని అడ్డుకోవడం వంటి కార్యక్రమాల ద్వారా.. కడప సంస్కృతిని విశాఖకు తెస్తున్నారన్న అభిప్రాయం కూడా ప్రజల్లోకి పంపేలా టీడీపీ వ్యూహరచన చేసుకుంటోంది.