ఈరోజు తిరుపతిలో తెదేపా బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నమ్మక ద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం తీరుకు నిరసనగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదాతోపాటు, ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న డిమాండ్ తో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే, ఇదే రోజున ప్రతిపక్ష నేత వైకాపా నేతలు కూడా వంచన దీక్షకు దిగారు. ఉదయం 7 గంటలకే విశాఖపట్నంలో దీక్ష ప్రారంభించారు. సరే, ఇది టీడీపీ కార్యక్రమానికి కౌంటర్ గా ఏర్పాటు చేసిన దీక్ష అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
గడచిన రెండ్రోజులుగా ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలు గమనిస్తే… తిరుపతి సభ నేపథ్యంలో టీడీపీకి అజెండా సెట్ చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే దొరకడం లేదనీ, అందుకే గవర్నర్ నరసింహన్ తో బేరసారాలు జరుపుతున్నారని మొన్న ఆరోపించారు. కేంద్రంతో కాళ్లబేరానికి ప్రయత్నిస్తూ, కేంద్రంతో పోరాటమని రాష్ట్రంలో చెబుతున్నారని నిన్న కూడా విమర్శించారు. తానే వెన్నుపోటు పోడిచి బుకాయిస్తారనీ, గాంధీని కాల్చిన గాడ్సేనే నిరసనగా దీక్ష చేస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. దీంతోపాటు కొన్ని ప్రశ్నలు సంధించారు. హోదా కోసం ప్రణాళిక సంఘానికి లేఖ ఎందుకు ఇవ్వలేదనీ, విపక్షాల హోదా ఉద్యమాలను నీరు గార్చింది మీరా కాదా, బంద్ చేస్తుంటే బలవంతంగా బస్సులు నడిపించారా లేదా, తాము అవిశ్వాసం పెట్టకుంటే టీడీపీ పెట్టేదా, వైకాపా ఎంపీలు మాదిరిగానే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదు.. ఇలా వరుసగా కొన్ని ప్రశ్నలు చంద్రబాబుకి వేశారు.
తిరుపతి సభలో ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి జవాబు ఇవ్వాలన్నది జగన్ డిమాండ్. అంటే, వైకాపానే టీడీపీ అజెండా సెట్ చేసే ప్రయత్నం ఇది అనుకోవచ్చు. తమ ఎంపీలు రాజీనామాలు చేస్తే… టీడీపీ ఎంపీలు చేయాలన్నారు. వారు అమరణ దీక్షకు దిగితే… టీడీపీ ఎంపీలూ దిగాలన్నారు. జగన్ దీక్ష చేస్తే.. దానికీ టీడీపీ మద్దతు ఇవ్వలేదంటారు! సరే… టీడీపీ అధికార పార్టీ కాబట్టి, ప్రతిపక్షం ఉద్యమించినంత ఈజీగా కేంద్రంపై నిరసన తెలపలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలపై బాధ్యత అధికార పార్టీదే. ఆ బాధ్యత వారికి ఉండదు. ఇప్పటికీ కేంద్రం వైఖరిలో మార్పు రాకపోవడంతో టీడీపీ కూడా ఉద్యమానికి దిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే వారికి ముఖ్యమనుకుంటే అధికార పార్టీకి మద్దతుగా నిలవొచ్చు కదా! ఇప్పుడు టీడీపీ ఉద్యమిస్తుంటే… దీన్ని ఒక రాష్ట్ర ప్రయోజనాంశంగా వైకాపా చూడటం లేదు. పైగా, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మీదా, టీడీపీ మీదా బురద చల్లి… అసలు విషయాన్ని పక్కతో పట్టించే ప్రయత్నమే వైకాపా చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం వైఖరి అనేది ఒకటి ఉంటుందనీ, రాష్ట్ర ప్రయోజనాలను తీర్చాల్సింది కేంద్రమే అనే టాపిక్ మీదకు జగన్ వెళ్లకుండా, జనాల్ని కూడా వెళ్లనీయకుండా ఒక అజెండా సెట్ చేస్తున్నారు. అదే అజెండాతో టీడీపీని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.