ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ. లక్షలు ఇచ్చారన్న ప్రచారంతో తమకు కనీసం ఓటుకు రూ. పదివేలు ఇస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు ఈ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. ఓటుకు రూ. వెయ్యి మాత్రమే అది కూడా అరకొరగా పంపిణీ చేశారు.
టీడీపీకి ఓటు వేస్తారు అనుకున్న వారెవరికీపంచలేదు. వైసీపీ ఓటర్లకు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. గత ఐదేళ్లుగా ఇష్టారీతిన సంపాదించుకున్నారని చివరికి ఓట్ల సమయంలో కూడా కొంత ఇవ్వలేరా అన్న అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఇచ్చే నోట్లపై వారి ఓటు బ్యాంకే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే నోట్లు ఇవ్వకపోయినా తమకు ఓటేస్తారన్న నమ్మకంతో ఎక్కువ మంది నేతలు డబ్బులు పంచడానికి ఇష్టపడలేదు.
నోట్ల పంచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు చాలా వరకూ తమకు అందిన డబ్బును సొంతానికి ఉంచుకునేందుకు ప్రయత్నించారు. ఇది కూడా ఆ పార్టీ అంచనాలకు అందుకోలేకపోవడానికి ఓ కారణంగా మారింది. ఓ పనిని సక్రమంగా పూర్తి చేయలేని చేతకానితనం వైసీపీకి.. ఎలక్షనీరింగ్ లోనూ కనిపించింది. పార్టీ క్యాడర్ ను నిర్లక్ష్యం చేసి వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటికే మోసం వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.