ప్రశాంత్ కిషోర్… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యంగా ప్రాధాన్యత సంతరించుకున్న పేరు ఇది! వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, పార్టీకి వ్యూహకర్తగా పీకేను నియమించుకున్నారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ ను నేరుగా జగన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అప్పట్నుంచే వైకాపాలో వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. వ్యూహకర్తలు తెర వెనకే ఉండాలిగానీ, వారిని ఇలా తెరముందుకు తేవాల్సిన అవసరం ఏముందనీ, ఆయనకు ఆ స్థాయి ప్రాధాన్యత అనవసరం అనేది కొంతమంది నేతల అభిప్రాయం. ఇన్నాళ్లూ పార్టీలో అంతర్గతంగా వ్యక్తమౌతున్న ఈ అసంతృప్తి, ఇప్పుడు పార్టీ అధినేత జగన్ వరకూ చేరింది!
పీకేని వ్యూహకర్తగా నియమించినట్టు ప్రకటించిన దగ్గర నుంచీ టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీని తట్టుకునే సత్తా జగన్ లేదనీ, అందుకే వ్యూహకర్తలపై ఆధారపడుతున్నారనీ, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారంటూ ఈ మధ్య మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పీకేకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇలా విమర్శలపాలు కావాల్సి వస్తోందని వైకాపా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని తాజాగా జగన్ ముందుకు తీసుకెళ్లారట. ప్రశాంత్ కిషోర్ సమక్షంలోనే ఈ అంశాన్ని చర్చకు తెచ్చారు. అక్టోబర్ లో చేపట్టబోయే పాదయాత్ర గురించి చర్చించేందుకు పార్టీ నేతలతో తాజాగా జగన్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ టాపిక్ ను లేవనెత్తారు. ప్రశాంత్ కిషోర్ ను తెరమీదికి తీసుకుని రావాల్సిన అవసరం ఏముందంటూ నేరుగా జగన్ ప్రశ్నించారు. తమకు జగన్ ఒక్కరే హీరో అనీ, ఆయన వల్లనే గెలిచామనీ, ఆయన వల్లనే ఒక్క సీటు నుంచి 67 సీట్లు గెలుచుకునే స్థాయికి పార్టీ ఎదిగిందనీ, ఇలా ఎదుగుతున్న పార్టీకి పీకే అవసరమా అని నాని సూటిగా అడినట్టు తెలుస్తోంది. ఇదే అభిప్రాయంతో మరికొంతమంది నేతలు ఏకీభవించినట్టు సమాచారం. దీంతో జగన్ స్పందించాల్సి వచ్చింది! తాను సలహాలు పాటిస్తుంటే ప్రశ్నిస్తున్నారనీ… తీసుకోకపోతే జగన్ ఎవ్వరి మాటా వినడం లేదని విమర్శిస్తారని జగన్ వ్యంగ్యంగా అన్నారట! ప్రశాంత్ కిషోర్ సూచనలు మాత్రమే చేస్తారనీ… వాటిని ఎలా అమలు చేసుకోవాలి అనేది తమ ఇష్టమని చెప్పారు. పాదయాత్ర చేయాలన్నది తన సొంత ఆలోచనేనీ, దానికి తుది మెరుగులు మాత్రమే పీకే ఇస్తున్నారని అన్నారు.
ఇదే సందర్భంలో పీకే కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచ్చులో చిక్కుకోవద్దనీ, పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారట. ఇలాంటి చర్చల్ని పక్కనపెట్టి బూత్ కమిటీలపై శ్రద్ధ పెట్టాలని సూచించారట. మొత్తానికి, ఈ చర్చ ఇక్కడితో ముగిసినట్టు జగన్, పీకేలు ముక్తాయించినా.. పార్టీ నేతల్లో ఉండాల్సిన అసంతృప్తి ఉంటుందనే చెప్పాలి. వైసీపీకి సొంత వ్యూహాలు లేవనీ, అందుకే పీకేని జగన్ నియమించుకున్నారనే చర్చ కిందిస్థాయిలో కూడా జరుగుతోందంటూ కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, దీన్ని ఎలా సర్దిచెబుతారో అనేదే అసలు ప్రశ్న..?