నంద్యాల ఉప ఎన్నికల్లోనూ కాకినాడ కార్పొరేషన్లోనూ అధికార పార్టీ విజయం ఆశ్చర్యం కాదు. అయితే ప్రతిపక్ష వైసీపీ ముఖ్యంగా నంద్యాలలో చేసిన హడావుడి వల్ల దాని వీరాభిమానులు మరో విధమైన ఫలితం ఆశించారు. జగన్ నోరు జారడం వల్లనే గాక చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల మొక్కులు అధికార దుర్వినియోగం అన్నీ కలసి టిడిపి గెలిచింది. ఇందుకు టిడిపిని ఎంతగా విమర్శించినా తమ తప్పొప్పులు కూడా చూసుకోవడం వైసీపీ బాధ్యత. కాని జరుగుతున్నదేమంటే అరిగిపోయిన రికార్డులా అవతలివారిని అనడం తప్ప మేము కూడా కట్టుదిట్టం చేసుకుంటాం పొరబాట్లు దిద్దుకుంటాం అన్న మాట వారి నుంచి రావడం లేదు. ఇది గాక కొంత కాలంగా వైసీపీ మేధావులు కొత్త వాదన తీసుకొస్తున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలన్నిటిలో తామే గెలిస్తే టిడిపి ఒక్కచోటైనా ప్రభావం చూపించలేకపోయిందని పదేపదే వాదిస్తున్నారు. అది సాంకేతికంగా నిజమే గాని ఆ ఉప ఎన్నికల నేపథ్యం అభ్యర్థులు, వాదనలూ అన్నీ వేర్వేరు. రాజీనామా చేసిన వారు అదే చోట్ల పోటీ చేసిన సందర్భమది. కాని తర్వాత శాసనసభ ఎన్నికలలో తామే వంటరిగా గెలుస్తామని అతి అంచనా వేసుకున్న వైసీపీ ఓట్ల తేడా స్వల్పమైనా సీట్లలో బాగా దెబ్బతిన్నది. ఆ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు నంద్యాల కాకినాడ ఫలితాలలో మరింత వెనకబడింది.పోల్చవలసింది 2014ను తప్ప అంతకుముందెప్పుడో ఉద్వేగంలో జరిగిన ఎన్నికలను కాదు కదా! ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు ప్రశాంత కిశోర్ సలహాలు పనికి రాలేదని చెప్పడం కోసం మిగిలిన దేశమంతా వేరు ఎపి వేరు అంటూ వాదన చేయడం కూడా అర్థరహితమే. వైసీపీ తనను తాను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడం, ప్రజా సమస్యలపై పనిచేయడం ఇప్పుడు మరింత అవసరం.