చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ… వైసీపీ ఎంపీ అధినేత ఇచ్చిన బంద్ పిలుపునకు.. ఆ పార్టీ నేతలు తప్ప ఇంకెవరూ స్పందించలేదు. గతంలో ప్రత్యేకహోదా బంద్కు వైసీపీ పిలుపునిచ్చినా.. కమ్యూనిస్టులు పిలుపునిచ్చినా.. ఒకరికొకరు స్పందించేవారు. కానీ ఇప్పుడు వైసీపీ పిలుపును కమ్యూనిస్టులు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరి పోరాటం వారు చేసుకుంటున్నారు. తాము పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలను వైసీపీ కోరింది. జనసేన, సీపీఐ, సీపీఎం లు సుదీర్ఘ చర్చల అనంతరం బంద్కు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించాయి. రెండు రోజుల నుంచి జరుగుతున్న సంప్రదింపులు కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది.
బంద్కు మద్దతు కోసం… సజ్జల రామకృష్ణారెడ్డి.. సీపీఐ, సీపీఎం నేతలకు ఫోన్ చేసి చేశారు. మద్దతివ్వాలని కోరారు. తమను అడగకుండా, కనీసం మాట మాత్రం అయినా చెప్పకుండా బంద్ కు పిలుపునిచ్చి, ఆ తర్వాత మద్దతు ఇవ్వాలని కోరడం ఏమిటని ఈ మూడు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చీటికీ, మాటికీ బంద్ పిలుపులు ఇచ్చి, ప్రజాజీవనాన్ని స్తంభింపచేయడం కూడా మంచిది కాదని వారు భావించారు. దీంతో పాటు విడిగా కమ్యూనిస్టులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మళ్లీ ప్రత్యేకంగా బంద్ పిలుపు అవసరం లేదని సీపీఐ, సీపీఎంలు ఒక నిర్ణయానికి వచ్చాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బంద్కు పిలుపునిచ్చినా మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి సైలెంట్ వెనక్కి తగ్గింది. బంద్కు మద్దతు ఇచ్చేప్రసక్తే లేదని…రఘువీరారెడ్డి అంతపురంలో తేల్చి చెప్పారు. విభజన హక్కుల పోరాట సమితి కూడా బంద్ కు మద్దతు ఇస్తూ ప్రకటన చేయలేదు. వైసీపీ ఎంపీలు రాజీనామాల చేసి పోరాటం నుంచి పారిపోవడం… సభలో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానిల ప్రసంగాలకు ప్రజల్లో మంచి స్పందన రావడం కూడా ఈ పార్టీలను ఆలోచింపచేశాయి. పోరాడుతున్న టీడీపీని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వెనక్కి తగ్గారు. దీంతో వైసీపీ ఒంటరిగానే బంద్ చేసుకుంటోంది.