తెలుగుదేశాన్ని విమర్శించేందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వైకాపా అంత ఈజీగా వదిలెయ్యదు! తాజాగా లోకేష్-చినరాజప్ప ఫొటో వ్యవహారమే అందుకు ఉదాహరణ. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు నారా లోకేష్‌ల మధ్య అంతరం పెరుగుతోందని కూడా ప్రచారం చేస్తోంది. నిజానికి, లోకేష్-చినరాజప్ప ఫొటో వ్యవహారం విషయంలో వైకాపా సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్టే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకుల శిక్షణ శిబిరంలో ఉప ముఖ్యమంత్రిపై లోకేష్ మండిపడ్డారంటూ జగన్ పత్రిక కథనాలు ప్రచురించింది. వైకాపా నాయకులు కూడా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో శిక్షణ కార్యక్రమంలో లోకేష్-చినరాజప్పల మధ్య జరిగిన సంభాషణ వీడియో తెలుగుదేశం విడుదల చేయడంతో వైకాపా నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో వైకాపా ఎదురుదాడికి రెండంటే రెండు అస్త్రాలపై ఆధారపడుతున్నట్టుగా ఉంది! గతంలోనూ ఇలానే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇంతకీ ఆ అస్త్రాలు ఏంటంటే… జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి!
విపక్ష నేత జగన్‌కు లోకేష్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలను తిప్పి కొట్టేందుకు వైకాపా నాయకుడు అంబటి రాంబాబు స్పందించి, జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూను మళ్లీ తెర మీదికి తెచ్చారు. చినరాజప్పను లోకేష్ విమర్శించిన క్లిపింగ్స్ ఎడిట్ చేసిన వీడియోని తెలుగుదేశం విడుదల చేసిందని అంబటి ఆరోపించారు. వాడుకుని వదిలేయడం తెలుగుదేశంలో సర్వసాధారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. 2009 ఎన్నికల్లో తారక్‌తో ప్రచారం చేయించుకున్నారనీ, అతడు ఆసుపత్రిలో ఉన్నా కూడా వదలకుండా ప్రచారం చేయించుకుని తరువాత వదిలేశారని అన్నారు. ఇదే తరుణంలో వైయస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనా, నారా లోకేష్‌పైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలమయం అని ఆమె అన్నారు. చంద్రబాబు అవినీతికి ప్రతిబింబం లోకేష్ అని ఆరోపించారు.
ఇలాంటి సందర్భాల్లో తారక్ ప్రస్థావన తీసుకురావడం వైకాపాకు ఎంతమేరకు లాభిస్తుందనేది ప్రశ్న? ఒకవేళ చంద్రబాబు తారక్‌ను వాడుకుంటే… ఇప్పుడు వైకాపా చేస్తున్నది ఏంటనే ఇంకో ప్రశ్న వస్తుంది..? నిజానికి, జూనియర్ ఎన్టీఆర్ విషయంతో తెలుగుదేశం అన్యాయం చేసినా, అతడిని పార్టీని దూరంగా పెడుతున్నా అది ఎన్టీఆర్ వ్యక్తిగత సమస్య అవుతుంది కదా! పైగా, దానిపై తారక్ కూడా స్పందించడం లేదు. తనను వాడుకుని వదిలేశారన్న బాధను బహిర్గతం చేసిందీ లేదు. అలాంటప్పుడు వైకాపా ఆ విషయాన్ని పదేపదే తెరమీదికి తీసుకురావడం ఎంతవరకూ కరెక్ట్?
ఇలాంటి సందర్భాల్లో లక్ష్మీ పార్వతితో విమర్శలు చేయిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది..? ఆమె వ్యాఖ్యలకు మీడియాలో ప్రాధాన్యత లభించొచ్చు. కానీ, వాటిని ప్రజలు ఎంతవరకూ సీరియస్‌గా తీసుకుంటారు అనేది మరో ప్రశ్న. పైగా, ఆమె ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చినా చంద్రబాబు నాయుడిపై విమర్శలు మాత్రమే చేస్తారని అందరికీ తెలుసు. ఆ విమర్శలో కొత్తదనం ఉండదని కూడా తెలుసు. మరి, ఎన్టీఆర్ ఇష్యూ… లక్ష్మీ పార్వతి విమర్శలు ఈ వైకాపాకి ఏ విధంగా లాభిస్తాయి..? ఇవి ఎంత మేరకు పొలిటికల్ మైలేజ్ ఇస్తాయో… దీని వెనక వారి వ్యూహమేంటో వారికే తెలియాలన్నది విశ్లేషకుల అభిప్రాయం.