ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ వైకాపా మరింత తీవ్రంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. హోదా పోరు తీరుతెన్నులపై ఆ పార్టీ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన తీరు వల్లనే ప్రత్యేక హోదా రాకుండా పోయిందనీ, తాము చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందనీ, ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. దీంతోపాటు ఇకపై హోదా పోరాటాన్ని ఏయే మార్గాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించారు. ఎంపీల రాజీనామా తరువాత వైకాపా పోరాటానికి మరింత మద్దతు పెరిగిందని విశ్లేషించుకున్నారు.
ఈ నెల 30న వంచన దినం నిర్వహించాలని వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆరోజు వైకాపా శ్రేణులూ అభిమానులూ నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే, అదే రోజున తిరుపతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. హోదా పోరాటంలో భాగంగా ధర్మ పోరాట దీక్ష, అనంతరం నియోజక వర్గాల్లో సైకిల్ యాత్రలు, తిరుపతిలో సభను టీడీపీ నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున వంచన దినం అంటూ వైకాపా సిద్ధమౌతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… వైకాపా వంచన దినం నిర్వహిస్తున్నది కేంద్రం లక్ష్యంగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనే! ప్రజలను వంచించిన చంద్రబాబుకు దీక్ష చేసే అర్హత లేదనే కోణంలోనే వైకాపా వంచన దినం జరపబోతోంది! రాష్ట్ర ప్రజలను వంచించిన కేంద్రంపై నిరసన కార్యక్రమం కాదిది! తిరుపతిలో టీడీపీ సభ పెట్టింది కాబట్టి, దానికి కౌంటర్ గా ఆరోజు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశమే వైకాపా ప్రయత్నంగా కనిపిస్తోంది.