విశాఖలో ప్రతిపక్ష పార్టీ నేతలు వంచన దీక్ష చేశారు. ‘పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం’ నాయకులూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. దీన్లో పాల్గొన్న నాయకుల ధ్యాసంతా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడమే. మొదట్నుంచీ వీరు చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటం కూడా ఇదేననుకోండి. చంద్రబాబును విమర్శిస్తే చాలు, హోదా వస్తుందని ఎలా అనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి! సరే, విశాఖ సభలో ఓ నాయకుడు కాస్త ఆవేశంగా మాట్లాడుతూ.. ‘వైయస్ జగన్మోహన్ రెడ్డి నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేస్తుంటే చెవులారా వినాలని ఉందని మురిసిపోయారు. అంతే, దీంతో అక్కడున్న నేతలంతా సంబరంలో మునిగిపోయారు. కేరింతలు కొట్టారు. సాక్షి కథనం ప్రకారమైతే.. మహిళా నేతలూ కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలూ అందరూ… ఈమాట వినగానే ఆనందం వ్యక్తం చేశారు.
వంచన దీక్ష పెట్టిందేమో ప్రత్యేక హోదా సాధన కోసం కదా! ఇవ్వాల్సిన కేంద్రాన్ని ఒక్కరైనా ధీటుగా నిలదీశారా అంటే.. అదీ లేదు. చంద్రబాబు రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారనీ, విదేశాల్లో సొమ్ము దాచుకున్నారనీ, అందుకే కేంద్రానికి భయపడుతున్నారని విజయసాయి రెడ్డి అంటారు. ఆయన ఆరోపణలకు ఆధారాలు ఉండవు! నాలుగేళ్లపాటు మాట్లాడకుండా, ఇప్పుడు హోదా అంటూ చంద్రబాబు పోరాటం చేయడం హాస్యాస్పదమని, ఇది అసమర్థ పాలన అని మరో ఎంపీ వరప్రసాద్ అంటారు. సరే, ఈ నాలుగేళ్లపాటు వైకాపా ఏం చేసిందో ఈయన చెప్పరు! మా ప్రాణాలు ఉన్నంత వరకూ హోదా కోసం పోరాడుతూనే ఉంటామని వైవీ సుబ్బారెడ్డి అంటారు. అంటే, హోదా కోసం ఇంకెన్నాళ్లు పోరాడతారో ఏమో! ఇలా దీక్షలో పాల్గొన్న నేతల ప్రసంగాలు వింటే… చంద్రబాబును విమర్శించేందుకు పెట్టుకున్న ప్రెస్ మీట్ కార్యక్రమమా ఇది అనిపిస్తుంది.
కేంద్రం మీద ఈగ వాలనివ్వరు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తారు. జగన్ ముఖ్యమంత్రి అయిపోవాలనీ, ప్రమాణ స్వీకారం చేస్తుంటే కళ్లారా చూడాలంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ వారిలో వారే ముసిపోతారు. ఇదండీ… ప్రతిపక్ష పార్టీ సాగిస్తున్న హోదా పోరాటం! హోదా సాధనలో భాగంగా చేసిన దీక్షల లక్ష్యం ఇదీ. రాష్ట్రానికి హోదా సాధన కంటే… జగన్ ముఖ్యమంత్రి పదవి సాధనపైనే ప్రతిపక్ష నాయకుల ధ్యాసంతా.