ఎంత పనికి మాలిన పని చేసినా వైసీపీ నేతల రాజకీయ విధానం ఒక్కటే. అదే ఎదురుదాడి. మీ నాయకుడు వేల కోట్లు సంపాదించాడుగా అంటే… మీ నాయకుడు సంపాదించలేదా ? అంటారు. మీ నాయకులు అవినీతి పరులు అంటే మీరేమైనా తక్కువా ? అంటారు. ఇలా అన్ని విషయాల్లోనూ అంతే. తమ నేతలు చేసిన దాని కన్నా ఎక్కువ ఆరోపణలు పక్క వారిపై చేసేసి… ఆ బురద చల్లేసి..ఎదురు దాడి చేయడం రాజకీయం అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కరెంట్ కోతల విషయంలోనూ అదే జరుగుతోంది. ఒక్క ఏపీలోనే కరెంట్ కోతలు కాదని.. దేశమంతా ఉన్నాయని.. కానీ ఏపీనే నిందిస్తున్నారంటూ కొత్తగా ప్రచారం ప్రారంంభించారు.
నిజానికి దేశంలో ఎక్కడా కరెంట్ కొరత లేదు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏపీ కంటే ఎంతో తక్కువగా ఉన్న తెలంగాణలో కూడా కరెంట్ కోతలు లేవు. అక్కడ కనీసం ఏసీలు వేసుకోవద్దు లాంటి సూచనలు .. . సలహాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ మాత్రమే కాదు…కర్ణాటక , తమిళనాడుల్లోనూ కరెంట్ కోతల్లేవు. అయినా పాత మీడియా క్లిప్పింగ్లు ఇతర వాటిని పట్టుకుని అన్ని చోట్లా కరెంట్ కోతలు ఉన్నాయని ప్రచారం చేసి.. తమను తాము మోసం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు వైసీపీ నేతలు.
కరెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రజలు ఏం చేసినా.. చేయకపోయినా పథకాలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాము కాబట్టి ఓట్లు తమకే వేస్తారన్న ఓ నమ్మకంతో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వారు ఓట్లు వేస్తారో లేదో రెడేళ్ల తర్వతా తేలుతుంది. కానీ ఇప్పటి నుండే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం.. పాలనపై దృష్టి పెట్టకపోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం. ప్రజలతో సంబంధం లేని రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు… ఎదురుదాడిలో మాత్రం తగ్గడం లేదు.