వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ పార్టీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి బీజేపీ తప్పుడు మార్గంలో వెళ్తోందని తేల్చేశారు. అయితే.. కేంద్ర పార్టీ గురించి కాదు. రాష్ట్ర బీజేపీ గురించి. ఏపీ బీజేపీ తప్పుడు మార్గంలో వెళ్తోందని.. కేంద్ర బీజేపీ స్పందిస్తే.. అప్పుడు తాము చెలరేగిపోతామన్నట్లుగా ఆయన విశాఖలో వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక కొరతపై సత్యాగ్రహానికి సిద్ధమయ్యారు. పోలీసుల వేధింపులు, పాలనా వైఫల్యాలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న నేతలూ అదే విమర్శలు చేస్తున్నారు. సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు.. జగన్ జైలుకెళ్తాడని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు ఎంతగా విమర్శిస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు.
భారతీయ జనతా పార్టీ నేతలు అంత తీవ్రంగా విమర్శిస్తున్న రాజకీయ పరంగా కౌంటర్ ఇవ్వడనికి వైసీపీ నేతలు భయపడుతున్నారు. బీజేపీపై ప్రతి విమర్శలు చేస్తే… ఎప్పుడు .. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారు పడుతున్నారు. అందుకే.. ఏమైనా అన్నా… అనకపోయినా.. టీడీపీపై విరుచుకుపడమని చెబుతున్నారు కానీ.. బీజేపీ విషయంలో మాత్రం నోరు మెదపవద్దని స్పష్టమైన సంకేతాలను ఆ పార్టీ అగ్రనేతలు.. అందరికీ పంపారు. ఈ కారణంగానే.. వైసీపీలో ఏ ఒక్క లీడర్ కూడా.. బీజేపీపై నోరు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని విశాఖలో జర్నలిస్టులు విజయసాయిరెడ్డిని అడిగారు.
బీజేపీపై విరుచుకుపడటానికి తమకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ఆయన… ఏపీ బీజేపీ నేతలు తప్పుడు మార్గంలో వెళ్తున్నారంటూ… కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ల రాజకీయ మార్గం ఏంటో.. తాను డిసైడ్ చేయాలనుకుంటున్నారు. కేంద్ర పార్టీ స్పందిస్తేనే స్పందిస్తామంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఉంటుంది. కేంద్ర పార్టీ.. రాష్ట్రపార్టీలు వేర్వేరు కాదు. ఏ రాష్ట్రంలో నేతలు.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు. వారే కేంద్రానికి వెళ్తారు. అంతే కానీ.. ఉత్తరప్రదేశ్ వాళ్లు వచ్చి.. ఏపీలో రాజకీయాలు చేయరు. ఈ విషయం విజయసాయిరెడ్డికి తెలియక కాదు. కానీ.. బీజేపీని విమర్సించాలంటే.. భయపడి.. ఇలా కవర్ చేసుకుంటున్నారన్నమాట..!