ప్రత్యేక హోదా కోసం తిరుగులేని పోరాటం అంటూ ఢిల్లీలో హడావుడి చేసిన వైకాపా ఎంపీలు కూడా రాష్ట్రానికి చేరుకున్నారు. హోదా ఇవ్వనందుకే లోక్ సభ సభ్యత్వాలకి రాజీనామాలు చేశామనీ, హోదా సాధన పోరాటంలో భాగంగానే దీక్షకు దిగామనీ, బలవంతంగా తమ దీక్షను భగ్నం చేశారని వైకాపా ఎంపీలు చెబుతున్నారు. ఈ నెల 22న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నరేంద్ర మోడీ ప్రధాన బాధ్యత వహించాలని, తరువాత చంద్రబాబు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని మేకపాటి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవనీ, పరిశ్రమలకు రాయితీలు వచ్చేవని ఆయన చెప్పారు. వీటన్నింటినీ చంద్రబాబు చెడగొట్టారనీ, హోదా కంటే ప్యాకేజీ బాగుంటుందని చెప్పారని ఆరోపించారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా సజీవంగా మిగిలి ఉందంటే కారణం జగన్ చేసిన ప్రయత్నమే అన్నారు. భవిష్యత్తు ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుందనీ, దాన్ని ఎవ్వరూ తప్పించలేరన్నారు. అలా సాధించుకోగలిగామంటే దానికి కారణం జగన్ చేసిన పోరాటాలే అవుతాయన్నారు.
హోదా కంటే ప్యాకేజీ బాగుంటుందని సీఎం చంద్రబాబు చెప్పారని మేకపాటి అంటున్నారు. నిజానికి, హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిందెవరు..? 14వ ఆర్థిక సంఘం పేరుతో ఇకపై ఎవ్వరికీ హోదా ఇవ్వమని భాజపా చెప్పలేదా..? కాబట్టే, హోదాకి బదులుగా ప్యాకేజీ ప్రకటిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లై చెప్పలేదా..? హోదా బదులుగా ప్యాకేజీ ఇవ్వండీ అని కేంద్రాన్ని రాష్ట్రం ఎన్నడైనా కోరిందా..? పేరేదైతేనేం హోదాకి సమానమైన ప్రయోజనాలు ఇస్తామని కేంద్రమే చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం కాదనే పరిస్థితి ఎలా ఉంటుంది..?
ఇంకోటి.. ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే కారణం జగన్ అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి అన్యాయం జరిగిందని టీడీపీ గళమెత్తే నాటికి… వైకాపా హోదా సాధన పోరాటం ఎక్కడుంది..? అప్పటికే జగన్ కాడె దించేశారు. పాదయాత్రకు వెళ్లిపోయారు. భాజపాపై టీడీపీ ఎదురు తిరిగిన తరువాతే ప్రత్యేక హోదా వాదనకు కొత్త ఊపు వచ్చింది. ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను కేంద్రం సక్రమంగా విడుదల చేసి ఉంటే… హోదా వాదన అనేదే తెర మీదికి వచ్చుండేదే కాదు కదా! అప్పుడు జగన్ పోరాటం అనేది ఎక్కడుంటుంది…? ఏదేమైనా, వైకాపా ప్రత్యేక హోదా పోరాటం… తెస్తామని మొదలై, వస్తుందే అనే నిర్లిప్తతకు చేరుకుంది.