అధికారంలోకి వచ్చాక పార్టీకి క్యాడర్ ఉందన్న సంగతిని జగన్ మర్చిపోయారని చాలా కాలంగా ఆ పార్టీలో విమర్శలు ఉన్నాయి. అన్నీ వాలంటీర్లే చేస్తున్నారు. బూత్ ఇంచార్జులకూ పని లేదు . ఇప్పుడు మళ్లీ అందరి అవసరం పడింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని మార్చి మళ్లీ ద్వితీయ శ్రేణి నేతల్ని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసేందుకు సీఎం జగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గృహసారధుల్ని నియమించాలని ఆదేశించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడాలని అనుకుంటున్నారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదన్న భావన ఆ పార్టీ క్యాడర్ లో ఎక్కువ ఉంది. వాలంటీర్లను నియమించి.. అన్ని బాధ్యతలు వారికే ఇచ్చారు. దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది. అదే సమయంలో సీఎం జగన్ .. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చాలా దూరంగా వెళ్లారు. ఎమ్మెల్యేలనే కలవడం కష్టంగా మారింది. ఇక స్థానిక నేతల్ని కలుస్తారా ?
నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నప్పుడు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై మంది ద్వితీయ శ్రేణి నేతల్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపిస్తున్నారు. అయితే అవి తరచుగా జరగడం లేదు. అందుకే సీఎం జగన్ జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో స్థానిక శాసససభ్యులతోపాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ద్వితీయ స్థాయి నాయకులకు కూడా ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఐ ప్యాక్ బృందం క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తి గురించి జగన్ కు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడంతో వారిని కూల్ చేసేందుకు ఏదో ఒకటి చేయాలని జగన్ నిర్ణయించారు. జిల్లాల పర్యటనలో వారితో భేటీ కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు
జగన్ చెప్పిన మన ప్లేట్లో మన బిర్యానీ కథకు క్యాడర్ అప్పట్లో ఫిదా అయింది. కానీ ఇప్పుడు… ఇప్పుడు మన ప్లేట్లో మన బిర్యానీనే కానీ.. బిల్లు కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీన్ని జగన్ ఎంత వరకూ సరి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.