డ్రామాల్లో వైసీపీ రాటుదేలిపోతోంది. ఆ పార్టీ నేతలు రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు వేస్తూంటే..ఆ పార్టీ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విధానాలతో డ్రామాలు వేస్తోంది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పి ముస్లింలను నమ్మించేందుకు వేస్తున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసినట్లుగా చెప్పుకుంది. కానీ సాంకేతిక లోపాలతో వేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఇంకా లిస్ట్ చేయలేదు.
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ పిటిషన్ లేదు. మరి పిటిషన్ వేసినట్లుగా వైసీపీ ఎందుకు చెప్పుకుందన్నది ప్రశ్నార్థకం. లిస్టు కాని విధంగా పిటిషన్ వేసి ప్రచారం చేసుకుంది. అంటే ఇటు ముస్లింలను మోసం చేసి..అటు బీజేపీకి కోపం రాకుండా చేయడానికి వేస్తున్న డ్రామా అన్నమాట.
ఇప్పటికే వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ పార్లమెంట్ ప్రసంగాల్లో వ్యతిరేకించింది. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటేశారు. కానీ కీలకమైన రాజ్యసభలో మాత్రం వక్ఫ్ బిల్లుకు సగం మంది ఎంపీలు మద్దతుగా ఓటేశారు. నలుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బిల్లుకు మద్దతిచ్చినట్లుగా లెక్కలు తేలాయి. విప్ జారీ చేశారు కానీ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుగా.. ఓటింగ్ అయిపోయిన తర్వాత జారీ చేశారు. ఇలాంటి డ్రామాలతో ప్రజల్ని ఎన్ని సార్లు నమ్మించగలరు ?