జమిలీ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక బయట మద్దతు ఇచ్చిన పార్టీ వైసీపీ మాత్రమే. జగన్ రెడ్డి తమపై దాడులు చేస్తున్నారని గగ్గోలు పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహిస్తే ఆయనకు మద్దతు పలికింది ఇండియా కూటమిలోని పార్టీలే. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ఆ పార్టీలకు మద్దతుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదు. జమిలీ ఎన్నికల విషయంలో మద్దతుగా ఉండవద్దని ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు విజయసాయిరెడ్డితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.
బీజేపీని ఇప్పుడల్లా వ్యతిరేకించే పరిస్థితి లేదని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది. పూర్తి స్థాయిలో బయటకు వచ్చి.. పోరాటానికి సిద్దమయినప్పుడు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా మట్లాడతామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన చూస్తే.. వక్ఫ్ బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ మద్దతు ప్రకటించకపోతే కనీసం వాకౌట్ అయినా చేస్తారు కానీ వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
జమిలీ ఎన్నికలు ముందుగా వచ్చినా.. వెనుక వచ్చినా.. తర్వాత వచ్చినా వైసీపీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయమని తమ పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి చెబుతూ వస్తున్నారు. ఆయన మాటల్ని ఎవరూ నమ్మకపోయినా … తాము పార్లమెంట్ అందుకే మద్దతిస్తున్నామని చెప్పే అవకాశం ఉంది. నిజానికి జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఎన్డీఏ కూటమిలోని కాకుండా ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం సపోర్టు చేస్తోంది.