వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు చేస్తున్నారని హోరెత్తించారు. తీరా చూస్తే.. మొత్తంగా పది వేల మంది కూడా రాజీనామాలు చేయలేదు. మొత్తంగా రెండున్నర లక్షల మంది వరకూ వాలంటీర్లు ఉన్నారు , వారందరితో రాజీనామాలు చేయించి పార్టీ కోసం పని చేయించుకోవాలనుకున్నారు. ఈ ప్రకారం సమాచారం ఇచ్చారు. అయితే వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తే.. తప్పని పరిస్థితుల్లో కొంత మంది రాజీనామాలు ప్రకటిస్తున్నారు. వారి లేఖలు అధికారుల వద్దకు వెళ్తున్నాయా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. రాజీనామాలు చేస్తే.. తమ భవిష్యత్ ఏమిటని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మారితే.. రాజీనామా చేసిన వాలంటీర్లకు అసలు భవిష్యత్ ఉండదు. ప్రభుత్వం మారకపోయినా.. రాజీనామాలు చేశారు కాబట్టి మళ్లీ తీసుకోవాల్సిందే. ఎప్పటికి తీసుకుంటారో.. ఏం చేస్తారో తెలియదు. అదే సమయంలో వైసీపీ కోసం పని చేసే వాలంటీర్లను క్షమించే ప్రశ్నే ఉండదని.. న్యాయంగా ఉంటే … యాభై వేల ఆదాయం వరకూ తెచ్చి పెట్టే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వాలంటీర్లపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడా వ్యవస్థ తమకు ఏ మాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. ఫోన్లు డిపాజిట్ చేశారు. వారికి సాంకేతిక సహకారం ఉండదు. యాభై మంది ఇళ్లతో టచ్ పోతుంది. వ్యక్తిగత పరిచయాలతో బెదిరించడానికి కూడా అవకాశం లేదు. అలా చేస్తే కేసులు పెడతాయి. రాజీనామాలు చేయడం కన్నా ఇంట్లో కూర్చుకుంటే.. డబ్బులు వస్తాయని… ప్రభుత్వం మారితే.. ఏదో ఓ ఆదాయమార్గం వస్తుందన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. అంటే వాలంటీర్లు వైసీపీకి రివర్స్ అవుతున్నారన్నమాట. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమే.