ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ ఏకపక్ష విజయం నమోదు చేసింది. గతంలో ఓటర్ల జాబితాలో తేడాలు ఉన్నాయన్న కోర్టులో పిటిషన్ వేయడంతో ఎన్నికలు నిర్వహించాలని.. కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాతకౌంటింగ్కు అనుమతి ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఈ రోజు ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. 50 డివిజన్ల ఏలూరు కార్పొరేషన్లో ఇంతకు ముందే రెండు డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవంగా వశమయ్యాయి. ఎన్నికలు జరిగిన డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ముందంజలో ఉన్నారు.
మొత్తంగా 45 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు మూడు చోట్ల గెలిచారు. ఇంతకు ముందు జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప అన్ని చోట్లా వైసీపీనే గెలిచింది. కార్పొరేషన్లలోనూ ఆ పార్టీనే పట్టు సాధించింది. ఏలూరులోనూ అదే తరహా ఫలితాలు వచ్చాయి. టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతే. అయితే జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు కొంత మేర మెరుగ్గా ఓట్లు సంపాదించుకున్నారు. ఈ ఫలితాలతో వైసీపీ ఉత్సాహం నెలకొంది.
ఇంకా ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారన్న కారణంగా నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. అయితే ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌కు వెళ్లింది. డివిజన్ బెంచ్.. ఆ తీర్పును సస్పెండ్ చేసినా… కౌంటింగ్ మాత్రం.. నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాతతీర్పును బట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా.. కౌంటింగ్ చేయాలా అన్నది నిర్ణయిస్తారు.