శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ రానుంది. ఇప్పటికే ఆ పార్టీకి టీడీపీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల షెడ్యూల్ వచ్చింది. స్థానిక సంస్థల్లో ఇతర పార్టీలకు చాన్సివ్వలేదు కాబట్టి.. ఆయా పార్టీలు ఎక్కడా పోటీచేసే అవకాశం కూడా లేదు. అంటే మరో 11 ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో పడతాయన్నమాట. ఈ ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో సంపూర్ణ ఆధిక్యం వస్తుంది. ప్రస్తుతం వైసీపీకి 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి 17 మంది ఉన్నారు.
ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. అయితే వైసీపీ అధినాయకత్వం మండలిని రద్దు చేయాలని ఎప్పుడో నిర్ణయించింది. నిబంధనల ప్రకారం తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు. కారణాలేమైనప్పటికీ ఇంకా కేంద్రం మండలిని రద్దు చేయలేదు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మండలి రద్దుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే రఘురామకృష్ణరాజు లాంటి నేతలు మాత్రం ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని పట్టించుకోవద్దని కాళ్లా వెళ్లా పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మండలి రద్దుపై వెనక్కి తగ్గితే మాట తప్పారని అంటారు. అందుకే తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేరు. కేంద్రం ఎప్పుడైతే రాష్ట్ర తీర్మానాన్ని క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు మండలి రద్దు అయిపోతుంది. పదవులన్నీ పోతాయి. ఇది వైసీపీకి భవిష్యత్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే మండలిలో సంపూర్ణ మెజార్టీ వచ్చినా వైసీపీ పెద్దలకు మాత్రం టెన్షనే మిగులుతోంది.