అధికారం పోయినా వైసీపీకి అహంకారం ఏ మాత్రం తగ్గలేదు. ఓటమికి కారణమేమిటో నిఖార్సుగా తేల్చుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయకుండా… టీడీపీ ఇచ్చిన హామీల వల్లే ఓడిపోయామని మా తప్పులేమీ లేవని డిసైడ్ చేసుకుని… తమదైన పద్దతిలో అహంకార పూరిత రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇది వైసీపీని రాను రాను మరింత లోతుల్లోకి దిగిపోయేలా చేస్తోంది.
ప్రజల్ని నిందించి ఏం ప్రయోజనం ?
తము పథకాలు ఇచ్చినా .. డబ్బులు ఇచ్చినా చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టే తనకు ఓట్లు వేయలేదని వైసీపీ ప్రజల్ని నిందిస్తోంది. చంద్రబాబు ఎక్కువ హామీలు ఇచ్చారని.. అందుకే ఓడించారని ఫిక్సయిపోయిది. చంద్రబాబు హామీలు ఎంత శాతం మేర ఓట్లను ప్రభావితం చేశాయో …వైసీపీ నేతలు పరిశీలన చేసుకుంటే.. తమకు వచ్చినట్లుగా చెప్పుకుంటున్న నలభై శాతం ఓట్లపై ఓ క్లారిటీ వస్తుంది. తమకు ఓట్లేసిన వారు ఎవరో… టీడీపీ కూటమికి ఓట్లేసిన వారు ఎవరో సిగ్గపడకుండా… విశ్లేషించుకుంటే తేడా తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఆ లబ్దిదారులకూ మెరుగైన పథకాలు ఇస్తున్నారు. అది తమ పార్టీని ఎంతగా డ్యామేజ్ చేయబోతోంతో వైసీపీ నేతలు గుర్తించడం లేదు. కానీ ప్రజల్ని నిందించడానికి మాత్రం ముందుంటున్నారు.
అధికారం పోయినా అదే రుబాబు !
అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నేత తానే జగన్ అన్నట్లుగా ఉండేవారు. తిరుమలలో అక్రమంగా క్యూలైన్లలోకి వచ్చి చిప్స్ అమ్ముకునే వ్యక్తి కూడా తన వెనుక జగన్ ఉన్నాడని రుబాబు చేస్తాడు… ఇక చోటా మోటా నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. దాని వల్లే అత్యధిక వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికీ అదే అహంకారం అందరిలోనూ కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఓటమి తర్వాత గుణాపాఠాలు నేర్చుకుని సైలెంట్ అవ్వాలి. కానీ అధికారం రుచి మరిగి ప్రజల్ని కాటేయడం ప్రారంభిచిన వారు… ఆపడం లేదు.
అధినేత అహంకారం రెట్టింపు
ఓటమి తర్వాత రాజకీయాలకు తగ్గట్లుగా మారాల్సిన జగన్ రెడ్డి తన అహంకారాన్ని రెట్టింపు చేసుకున్నారు. ప్రజలు, అసెంబ్లీని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం స్పీకర్ ఎన్నికకు సంప్రదాయంగా హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని తేల్చేశారు. కచ్చితంగా రావాల్సినదైతే అడుక్కోవాల్సిన పని ఉండదుగా. కానీ ఆయన స్టైలే అది. మొత్తంగా ఈ అహంకారం వైసీపీని ఎక్కడికి తీసుకెళ్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది.