తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ ఐదు లక్షల మెజార్టీని బెంచ్ మార్క్‌గా పెట్టుకుని పని చేసిన ఆ పార్టీకి ఈ ఫలితం మాత్రం అంత సంతృప్తిని ఇవ్వలేదు. పోలయ్యే ఓట్లలో 70 శాతం వైసీపీకే పడాలని ఆ పార్టీ నేతలు టార్గెట్ పెట్టుకుని పని చేశారు కానీ.. చివరికి గతంలో వచ్చినంత మెజార్టీ మాత్రమే వచ్చింది. రెండు లక్షల ఇరవై వేల మెజార్టీ దగ్గర వైసీపీ ఆగిపోయింది. గతంలో వచ్చినంత ఓటింగ్ పర్సంటేజీ మాత్రమే వచ్చింది. ఐదు కాదు ఆరు లక్షల మెజార్టీ వస్తుందంటూ.. మంత్రులు చేసిన ప్రకటనలతో ప్రస్తుత విజయం.. పెద్దగా కనిపించడం లేదు.
నిజానికి రెండున్నర లక్షల మెజార్టీ అంటే… ఘన విజయమే. కానీ ఏపీలో ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు.. ప్రత్యర్థుల్ని కనీసం ప్రచారం చేయనివ్వలేని పరిస్థితి.. అధికార పార్టీ ఓటర్లను గుర్తించి టార్గెట్ చేయడం.. వాలంటీర్లు.. అంతకు మించి దొంగ ఓట్ల దండయాత్ర వంటి విశేషణాలన్నీ కలసి వచ్చినా… వైసీపీ అనుకున్న మెజార్టీ మార్క్ సాధించలేకపోయింది. ఇది తెలుగుదేశం పార్టీకి గొప్ప రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంత తీవ్రమైన ఓత్తిళ్లు ఉన్నా.. తమ ఓటు బ్యాంక్ తమకే ఉంటుందని.. మరోసారి టీడీపీ నిరూపించుకోలిగింది.
ఇక… తిరుపతిలో గెలుస్తామంటూ హడావుడి చేసి.. జనసేనతో పొత్తు పెట్టుకుని.. ఇక తమ్ముడొచ్చాడు.. తనను పార్లమెంట్‌కు తీసుకెళ్తాడని ఆశలు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు.. డిపాజిట్ కూడా దక్కలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇరవై వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి జనసేన పొత్తు వల్ల అదనంగా మరో ముఫ్పై వేల ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ ఓటు బ్యాంకుకు అదనంగా జమ అయిందేమీ లేదు. అలాగని… రంగంలో ఉన్న.. గాజు గ్లాస్ గుర్తు ఏమైనా నష్టం చేసిందా అంటే అదేమీ లేదు. ఆ గాజు గ్లాస్ గుర్తుకు పట్టుమని నాలుగు వేల ఓట్లు కూడా రాలేదు. మొత్తంగా.. ఉపఎన్నికలో.. పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ తగ్గిపోయినా.. అనుకూల ఓటర్లతో ఓట్లేయించుకునేలా వ్యూహం పన్నినా వైసీపీ మెజార్టీ మాత్రం పెరిగలేదు.
తిరుపతి ఉపఎన్నిక ద్వారా దేశం మొత్తం ఏపీ వైపు తిరిగి చూసేలా చేయాలని సీఎం జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ బాధ్యతను వారు పోలింగ్ రోజు పూర్తి చేశారు. దొంగఓట్ల దండయాత్రకు ఆ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది.