రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయమై జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నిక విషయమై ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం మేరకు, పార్టీ వ్యవహారాల కమిటీ చర్చించి సూచించిన ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికిగానీ, లేదా ఎన్డీయే పక్షాల నుంచి బరిలోకి దిగే అభ్యర్థికిగానీ వైకాపా మద్దతు ఇవ్వదని విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.
ఇంతకీ, వైకాపా ఎందుకు మద్దతు ఇవ్వలేదన్న కారణం కూడా చెప్పారండోయ్! కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్డులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిందనీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని భాజపా చెప్పిందన్నారు! హోదా విషయమై భాజపా అంతిమ నిర్ణయం ప్రకటించినట్టుగా ఉందనీ, ఇదే అంశమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తోందనీ, ప్రత్యేక హోదా సాధన కోసం తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారనీ.. అందుకే, భాజపాకి వ్యతిరేకంగా తాము ఓటేస్తున్నామని.. ఇంతే స్పష్టంగా పూసగుచ్చినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.
భాజపాకి మద్దతు ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆంధ్రాకు చెందిన వైకాపా ఇంత స్పష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..! ఆంధ్రాకి భాజపా ఏ స్థాయిలో నమ్మక ద్రోహం చేసిందనేది జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన అంశమే. సహజంగానే.. భాజపాకిగానీ, ఎన్డీయే అభ్యర్థిగానీ ఓటేసేందుకు ఏపీకి చెందిన ఏ పార్టీలూ సంసిద్ధంగా ఉండవనే అందరూ అనుకుంటారు. కానీ, వైకాపా మాత్రం ప్రత్యేకంగా ప్రకటించాల్సిన పరిస్థితిలో ఉంది! విజయసాయి రెడ్డి ఇంత స్పష్టంగా విడమరచిన చెప్పి, పార్టీ తరఫున చిత్తశుద్ధిని పదేపదే ప్రదర్శించుకోవాల్సి వస్తోంది.
పైగా, సుప్రీం కోర్టులో హోదాకి ప్రతికూలంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన కారణాన్ని ఇప్పుడు విజయసాయి చూపుతున్నారు. నిజానికి, హోదా అంశమై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన వెంటనే వైకాపా వ్యతిరేకించలేదు. టీడీపీతోపాటు అన్ని పార్టీలూ కేంద్రం తీరుపై దుమ్మెత్తి పోస్తుంటే… తప్పదన్న పరిస్థితి ఏర్పడ్డాకనే జగన్ స్పందించారు. ఇదే కారణంతో రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఓటెయ్యడం లేదంటే.. వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తోంది.