వైకాపాతో కొంత సన్నిహితంగా ఉన్నవారికి ఈ మాట గుర్తుండే ఉంటుంది! 2014 ఎన్నికల్లో జగన్ గెలుపు తథ్యమని మొదట్నుంచీ వైకాపా వర్గాలు చాలా ధీమాతో ఉన్నాయి. కానీ, వైకాపా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున… జగన్ ను పలకరించేందుకు నేతలు, అభిమానులు చాలామంది వెళ్లారు. వారిలో కొంతమందితో జగన్ చెప్పిన మాటేంటంటే… ‘మరో ఐదేళ్లే కదా, పోరాటం చేద్దాం, అధికారం వస్తుంది’ అని! అక్కడి జగన్ చేసిందీ అదే.. ఐదేళ్లపాటు ఎదురుచూడ్డం. ఈ క్రమంలో గడచిన ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున ఏం చేశారు అనేది వేరే చర్చ! అయితే, అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎన్నికలు – అధికారం ఫోకస్ గానే జగన్ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కావడం లక్ష్యంగానే మాట్లాడుతూ ఉండేవారు. చివరికి, బహిరంగ సభల్లో కూడా… ‘మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం’ అనేట్టుగానే మాట్లాడతారు. ఈ తీరుపై వైకాపాలో మొదట్నుంచీ కొంత చర్చ ఉంది.
ముఖ్యమంత్రి కావడమే తన కల అంటూ ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా జగన్ చెప్పారు. అంతేకాదు, ఒకసారి అధికారం వస్తే మూడు దశాబ్దాలు పరిపాలించాలనే సంకల్పం తనకి ఉందనీ మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి గురించి జగన్ ఇలా పదేపదే మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయం పార్టీలో కొంతమందిలో ఉంది. ఎప్పుడూ పదవి గురించే మాట్లాడుతుంటే… ప్రజల్లోకి వెళ్లే సంకేతాలు వేరుగా ఉంటాయనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అయితే, ఆ మాటను నేరుగా జగన్ ముందుకు తీసుకెళ్లగలిగే పరిస్థితి వైకాపాలో ఉంటుందా..?
ఇక, ప్రస్తుత విషయానికొస్తే… నిన్న, కాకినాడలో జరిగిన సమర శంఖారావ సభలో మొట్ట మొదటిసారిగా… ‘నాకో అవకాశం ఇవ్వండి’ అంటూ ప్రజలను కోరారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ‘ఒక అవకాశం’ అని ఆయన మాట్లాడింది లేదు. మొదట్నుంచీ జగన్ ఇలానే మాట్లాడి ఉంటే బాగుండేదనే చర్చ వైకాపా వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తోంది. తనని ముఖ్యమంత్రిని చెయ్యండని కోరే కంటే, తనకో అవకాశం ఇవ్వండి అని కోరడం ద్వారా ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళతాయని వైకాపా కార్యకర్తల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అయితే, వాస్తవం ఏంటంటే… ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది! ముఖ్యమంత్రి కావడమే జగన్ లక్ష్యం అనేది ప్రజల్లో బలంగా నాటుకుంది. పైగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ కోరడాన్ని మరోలా విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు. జగన్ ఆత్మవిశ్వాసంలో తేడా కనిపిస్తోందని అనేవారూ లేకపోలేదు!