వైసీపీ అధినేత జగన్ రాజకీయం.. పార్టీ నేతల్ని బలి చేసి.. వారి రాజకీయ భవిష్యత్ సమాధులపై నుంచి తన రాజకీయాన్ని నిర్మించుకోవడం అనే వ్యూహంతో ఆధారపడి ఉంటుంది. వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇలా ఎంతో మంది నేతలు వైసీపీ కోసం పూర్తి స్థాయిలో శ్రమించి అడ్రస్ లేకుండా పోయింది. ఎంతో వీర విధేయులకు కూడా చివరికి అదే పరిస్థితి. ఎప్పటికప్పుడు కొత్త బలిపశువుల్ని వెదుక్కోవడంలో ఆయన పార్టీ… ముందు ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయంలోనూ అలాంటి వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు.
బూతులు తిట్టి వ్యక్తిగత శత్రువుల్ని పెంచుకుంటున్న గుడివాడ అమర్నాథ్ !
పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్న నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ ముందున్నారు. పవన్ కల్యాణ్ పాలసీల పరంగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు.. ఆయనపై రివర్స్ ఎటాక్ చేయడం సహజమే. కానీ ఆ రివర్స్ ఎటాక్ వ్యక్తిగత విషయాల మీద చేయడం వైసీపీ వ్యూహం. అటు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయనగానే జీ హుజూర్ అంటూ.. కొంత మంది వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. సామాన్యంగా వీరంతా పవన్ సామాజికవర్గానికి చెందినవారే ఉంటారు. వీరిలో గుడివాడ అమర్నాథ్కి ప్రత్యేకశైలి. మంత్రి పదవి వచ్చిందని ఆయన నేల మీద నిలబడటం లేదు. ప్రత్యేక భద్రత ఇచ్చారని.. జగన్ తర్వాత తానే అన్న ఫీలింగ్‌లో ఉన్నారేమో కానీ చిన్నా పెద్దా తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.. ఆయన కూడా వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ పై చేసిన కామెంట్లు.. గుడివాడ అమర్నాథ్ పై జాలి చూపించేలా చేస్తున్నాయి. రేపేనేది ఉండదా అన్నకామెంట్లు కనిపిస్తూండటమే దీనికి కారణం.
రైతులపై దాడి చేసి రాజమండ్రి ఎంపీ ఏం సాధిస్తారు ?
అమరావతి రైతులు తమ మానాన తాము పాదయాత్ర చేసుకుంటున్నారు. వారు ఎవర్నీ రెచ్చగొట్టడం లేదు. గతంలో తిరుపతి వరకూ వెళ్లివచ్చారు. ఏమీ జరగలేదు. తణుకు వరకూ ప్రశాంతంగా జరిగింది. కానీ ఇలా రైతుల పాదయాత్ర జరిగితే తమకే ముప్పు అని వైసీపీ పెద్దలనుకున్నారు. వారిపై అరాచకానికి ప్లాన్ చేశారు. ఎవరు బాగా చేస్తే వారికి గుర్తింపు అన్నట్లుగా రచ్చ చేశారు. చివరికి రాజమండ్రికి వచ్చిన రైతులకు .. ఎంపీ భరత్ నేరుగా దాడికి దిగారు. కొంత మంది వైసీపీ మూకతో రైతులపై ఆయన చేసిన ఆకృత్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భరత్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలి సారి ఎంపీ అయ్యారు. కానీ ఆయన భవిష్యత్‌ను ఇలాంటి చర్యలతో నాశనం చేసుకుంటున్నారు. స్వతహాగా ఇది ఆయన నైజం కాదు.. కానీ హైకమాండ్ చెప్పింది. చేశారు. కానీ నష్టం మాత్రం ఆయనకు..లాభం మాత్రం వైసీపీ హైకమాండ్‌కు.
కొంత మందిని అదే పనిగా వాడేసుకుంటున్న వైసీపీ పెద్దలు !
ఓ వల్లభనేని వంశీ.. మరో కొడాలి నాని.. పేర్ని నాని .. భరత్ రామ్, గుడివాడ అమర్నాత్.. ఇలా కొంత మందిని టార్గెటెడ్‌గా వాడుకుంటున్నారు. వారికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతోందంటే… రేపు పార్టీ ఓడిపోతే వారెవరూ రాష్ట్రంలో కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా చేస్తున్న తీరు వల్ల… ఇతరుల్లో ఎంత అసహనం పెరిగిపోతోందో.. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనే నిదర్శనం. వీరందర్నీ వైసీపీ హైకమాండ్ కాపాడుకుంటుందా అంటే… కనీసం సోషల్ మీడియా పోస్టులు పెట్టి అరెస్టయిన వారికి కూడా సాయం చేయడం లేదు.. మరి వీరికేం చేస్తుంది. రాజకీయాన్ని రాజకీయంలా చేసుకుంటే…. వైసీపీ యువ నేతల భవిష్యత్ భద్రంగా ఉంటుంది. లేకపోతే.. తాత్కాలిక పదవుల కోసం తాము బలి పశువులం అయ్యామని.. కొన్నాళ్లకు తెలిసిపోతుంది. అప్పుడు చేయగలిగిందేమీ ఉండదు.