రాజధాని అమరావతికి ఏపీ సర్కార్ బిగిస్తున్న చిక్కుముళ్లన్నీ.. ఒక్కొక్కటి విడిపోతున్న సూచనలు కనిపిస్తున్న సమయంలో… రాజకీయ గందరగోళం రేపే.. వ్యూహానికి అంకురార్పణ జరిగింది. భూములిచ్చిన రైతులమంటూ.. కొంత మంది తెరపైకి వచ్చి… చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందటూ ఆరోపణలు ప్రారంభించారు. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత.. చంద్రబాబు అమరావతిలో పర్యటించాలంటూ…డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 28న అమరావతిలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలవుతున్న సందర్భంగా.. అమరావతిలో నిర్మాణాలను పరిశీలిస్తారు. ఆరు నెలల కిందట ఎలా ఉన్నాయి..ఇప్పుడెలా ఉన్నాయనే అంశాన్ని చూస్తారు. నిర్మాణంలో ఉన్న పలు భవనాలు, పూర్తయిన కొన్ని రహదారులు, 25 శాతం పూర్తయిన కట్టడాలను కూడా పరిశీలిస్తారు.
ఈ పర్యటన కోసం టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తూండగా… అమరావతి రైతులమంటూ.. ఓ ఇరవై మంది గ్రూప్… రాజధాని భూముల్లో పర్యటించింది. అవకతవకలు జరిగాయని.. వారికి వారే నిర్ధారించినట్లుగా ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాల్సిన పని లేదని…తామే చెబుతున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తమకు మూడేళ్లలో ప్లాట్లు ఇస్తామన్నారని.. ఇవ్వలేదని… ఆరోపించారు. తమకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని.. ఇప్పుడు ఆయన అమరావతిలో పర్యటించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తే.. రైతుల పేరుతో.. చంద్రబాబు పర్యటన వద్దంటూ.. అనూహ్యంగా కొంత మందిని తెరపైకి తీసుకురావడం ప్రభుత్వ గేమ్ ప్లాన్ లో భాగమని నమ్ముతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం..పొలిటికల్ మ్యాప్‌లో పెట్టడం… ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై .. హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో… అమరావతిని మార్చడానికి ప్రభుత్వానికి అవకాశమే లేదని.. నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో… రైతుల పేరుతో.. కొంత మందిని తెరపైకి తేవడంలో.. కొంత మంది కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ పరిణామంతో రాజధాని విషయంలో కొత్త రగడ ప్రారంభమవడం ఖాయంగా కనిపిస్తోంది.