టీడీపీ అధినేత చంద్రబాబు.. భారతీయ జనతా పార్టీని, నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారు. అయితే.. ఈ పోరాటంలో తాము ఎక్కడ వెనుకబడిపోతామో అనుకుంటున్నారో కానీ.. వైసీపీ అగ్రనేతలు గుర్తొచ్చినప్పుడల్లా.. వంచనపై గర్జన అంటూ.. రోజంతా ప్రసంగాల ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు. ఎంపీలు ప్రత్యేకహోదా కోసం అంటూ రాజీనామాలు చేసి .. ఆమోదం పొందక ముందే.. ఇవి ప్రారంభించారు. కానీ.. కాకినాడ గర్జనతో.. ఐదు జిల్లాల్లో మాత్రమే నిర్వహించారు. ఈ సభల్లో ప్రసంగించేవారికి.. స్పష్టమైన.. నియామవళి.. ” డూస్.. అండ్ డోన్ట్స్ ” రూపంలో అందిస్తారో.. లేక తమ పార్టీ స్టాండ్ ను పక్కాగా అర్థం చేసుకుంటారో కానీ… తన విమర్శల్లో.. ఎక్కడా ప్రత్యేకహోదా, స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్.. విభజన హామీలు వంటి ప్రస్తావన తీసుకు రానే రారు. మాట వరుసకు వచ్చినా.. ఆ హామీలు నెరవేర్చాల్సిన బీజేపీ దగ్గరకు పోనీయరు. అంతా చంద్రబాబేనని.. అక్కడకు తీసుకెళ్లిపోతారు.
కాకినాడ గర్జనలోనూ.. వైసీపీ నేతల అవస్థలకు వాళ్ల ప్రసంగాలే అద్ధం పట్టాయి. బీజేపీ కన్నా.. కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా విమర్శించారు. కాంగ్రెస్తో పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. విభజన సమయంలో… కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా ఇటలీ దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని ఆక్రోశించారు. కానీ విభజన హామీల ప్రస్తావన మాత్రం ఎక్కడా తీసుకు రాలేదు. చంద్రబాబు నాయుడ్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి నేతలు పోటీ పడ్డారు. విద్యార్ధి దశ నుంచే వంచన చేస్తూ వచ్చారని తీర్మానించారు. పనిలో పనిగా… రాజధానిపైనా విమర్శలు గుప్పించారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఉండవు..అన్నీ తాత్కాలికమేనని, తాత్కాలిక రాజధానితో రాజధాని లేకుండా బాబు తీర్చిదిద్దారని తమ కోపం వ్యక్తం చేశారు.
అసలు వంచన దీక్షలు ఎవరి వంచన మీద పెడుతున్నారో కూడా.. వైసీపీ నేతలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి దీక్షల వల్ల.. బీజేపీపై.. కేంద్రంపై పోరాడలేని తన నిస్సహాయత్వం పదే పదే బయట పడుతుందని తెలిసినా… వైసీపీ నేతలు.. ఇలాంటి దీక్షలు పెట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయాలు వారి పార్టీలోనే వినిపిస్తున్నాయి. కానీ.. ఏదో ఓ శుక్రవారం.. పాదయాత్ర లేని రోజు.. ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల.. పార్టీ యాక్టివ్ గా ఉందన్న భావన ప్రజల్లోకి వెళ్తుందని వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కానీ.. అసలు వారు చేసే వంచన దీక్షలు ఎందుకన్నదానిపై.. కాస్తంత క్లారిటీ అయినా తెచ్చుకుని ప్రసంగాలు చేస్తే బాగుంటుంది కదా.. అన్నది కార్యకర్తల అభిప్రాయం. మరి వారు వింటారో లేదో..?