తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
నాగచైతన్య ఈమధ్య ఎంచుకొంటున్న కథల్ని గమనిస్తే తన తండ్రి నాగార్జున అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అనిపించింది. ఒకదానికొకటి సంబంధం లేకుండా కథల్ని ఎంచుకొంటున్నాడు. నటుడిగా తనలోని భిన్న పార్శ్వాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. `ప్రేమమ్`, `సాహసం శ్వాసగా సాగిపో`, `రారండోయ్ వేడుకచూద్దాం` ఇలా ఆయన ప్రయాణం సాగుతోంది. ఇంతలో `యుద్ధం శరణం` అన్న టైటిల్, ఆ పోస్టర్లలో ఇంటెన్సిటీతో కూడుకొన్న చైతూ లుక్ ఆసక్తిని రేకెత్తించింది. మరోసారి చైతూ కొత్త కథని ఎంచుకొన్నట్టుగా సంకేతాలు వచ్చేశాయి. మరి నిజంగా `యుద్ధం శరణం` కొత్త కథేనా? ఆ కథ ఎలా ఉందో తెలుసుకుందాం…
* కథ
డాక్టర్లయిన సీతాలక్ష్మీ (రేవతి), మురళీ కృష్ణ(రావూ రమేష్) ముద్దుల కొడుకు అర్జున్ (నాగచైతన్య). మంచి ఉద్యోగం వచ్చినా వదిలిపెట్టి కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో డ్రోన్ తయారు చేసే పనిలో ఉంటాడు. ప్రయోగం, తల్లిదండ్రులు, అక్కాచెల్లెలు, స్నేహితులే తన ప్రపంచం. ఇంతలో తన తన తల్లిదండ్రుల దగ్గర ట్రైనీగా చేరేందుకు అంజలి (లావణ్య) వస్తుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడతాడు అర్జున్. ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పాలనుకొనేలోపే వాళ్లు కనిపించకుండాపోతారు. ఒక్కసారిగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. తీరా ఆ ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారని తెలుస్తుంది. కానీ జరిగింది యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలనే వాళ్లను చంపేశారని అర్జున్‌కి, కుటుంబ సభ్యులకి అనుమానం వస్తుంది. అసలు ఎవరితోనూ శత్రుత్వం లేని సీతాలక్ష్మి, మురళీకృష్ణల్ని ఎవరు చంపేశారు. నాయక్ (శ్రీకాంత్) అనే రౌడీతో వాళ్లకున్న శత్రుత్వం ఎలాంటిది? తన తల్లిదండ్రుల్ని చంపినవాళ్లపై అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
* విశ్లేషణ
కొత్త కథ చెప్పడం లేదనుకొన్నప్పుడు కథనం, సన్నివేశాల్లోనైనా కొత్తదనం ఉండేలా చూసుకోవాలి. `యుద్ధం శరణం` బృందం అదే చేయలేదు. రాసుకొన్నంతవరకు కథని బాగానే చెప్పాడు దర్శకుడు, కథనం పరంగా కూడా కొత్తదనం చూపేందుకు ప్రయత్నించాడు. కానీ చెప్పిన ఆ కథలోనే కొత్తదనం లేకపోగా, కీలకమైన కథనమూ కుదర్లేదు. దాంతో సినిమా ఏ దశలోనూ ప్రేక్షకుడిని రక్తికట్టించలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ని ఆరంభం నుంచే వాడుకొన్నప్పటికీ , దాని చుట్టూ అల్లుకొన్న సన్నివేశాల్లో బలం లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, లవ్ ఎపిసోడ్ కాస్త పండింది మినహాయిస్తే మిగతా ఎక్కడా ప్రేక్షుకుడికి సంతృప్తినిచ్చేలా సినిమా తీయలేకపోయాడు దర్శకుడు. లవ్ ఎపిసోడ్‌తోనూ, హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌తోనూ సినిమా గాడిన పడుతుందనుకొనేలోపే దర్శకుడు ఆ కథని కట్ చేయడం ప్రేక్షకుడిని నిరాశపరుస్తుంది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో కథనాన్నే గమనించే ఒప్పుకొనుంటాడు. కానీ ఆ కథనమే ఆశించినస్థాయిలో కుదర్లేదు. సినిమా చూస్తున్నంతసేపూ చైతూ ఇదివరకు నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` సినిమానే గుర్తుకొస్తుంది. దర్శకుడిపై గౌతమ్ మేనన్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన స్టైల్లోనే సన్నివేశాల్ని సహజంగా తీర్చిదిద్దాడు. కథానాయకుడి పాత్ర, ఆయన సంభాషణలు కూడా గౌతమ్ మేనన్ సినిమాల్లోలాగే ఉంటాయి. ప్రథమార్థంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన వినోదం, ద్వితీయార్థంలో హీరోవిలన్ల మధ్య మైండ్ గేమ్ కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది మినహా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. శ్రీకాంత్ లుక్, నటన చూశాక మాత్రం ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి మరో మంచి విలన్ని పరిచయం చేసిందనిపిస్తుంది. నాయక్ పాత్రలో శ్రీకాంత్ మంచి ఇంటెన్సిటీతో నటించాడు.
* నటీనటుల ప్రతిభ
నాగచైతన్యకి బాయ్ నెక్ట్స్ డోర్ తరహా పాత్రే దక్కింది. హీరోయిజాన్ని కూడా పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఆ స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు సహజత్వం కోసం అటువైపు వెళ్లలేదనపిస్తుంది. లావణ్య త్రిపాఠి ఒక పాటలో తన అందాలతో మత్తెక్కించేలా కనిపిస్తుంది. చిట్టిపొట్టి డ్రెస్సులేసుకొని కనిపించింది. కాకపోతే ద్వితీయార్థంలో ఆమె పాత్రకి ప్రాధాన్యమే దక్కలేదు. శ్రీకాంత్ పోషించిన నాయక్ పాత్రలో విలనిజం పండలేదు కానీ… ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం మాత్రం చాలా బాగుంది. రావు రమేష్, రేవతి అమ్మానాన్నలుగా చాలా బాగా నటించారు. వాళ్ల పాత్రలు సినిమాకి ప్రధాన బలం. మురళీశర్మ, ప్రియదర్శి, వినోద్ కుమార్ తదితర నటులున్నా వాళ్ల నుంచి దర్శకుడు రాబట్టుకొన్నదేమీ లేదు. ఆ పాత్రల పరిధే తక్కువ.
* సాంకేతికత…
దర్శకుడికి ఇదే తొలి చిత్రమైనప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా సినిమాని తీశాడు. కాకపోతే ఎంచుకొన్న కథపైనా, రాసుకొన్న ఆ కథనంపైనా ఇంకాస్త కసరత్తులు చేసుంటే బాగుండేది. వారాహి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నికేత్ కెమెరా పనితనం, వివేక్ సాగర్ సంగీతం కథకు తగ్గట్టుగా బాగా కుదిరింది. అబ్బూరి రవి మాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఆయన కలం అక్కడక్కడా మెరిసిందంతే. ఎడిటింగ్ బాగుంది.
* ఫైనల్ పంచ్..: ఈ యుద్ధం రొటీన్
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5