వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం వైసీపీ నేతలకు కష్టమైపోతోంది. తాజాగా వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి తమ భూమిలోకి కొంత మంది అక్రమంగా ప్రవేశించారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండాపూర్లో తమకు భూమి ఉందని తాము 2006లోనే కొనుగోలు చేశామని ఆ భూమిలోకి ఇప్పుడు అనిల్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారని.. కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అనిల్ రెడ్డి .. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దామోదర్ రాజనర్సింహ బావమరిది. ఆ భూమి తమదేనని.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబమే దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తూ… అనిల్ రెడ్డి, గజ్జల నరసింహారెడ్డి అనే వ్యక్తులు ఎదురు ఫిర్యాదు చేశారు. 2006లో ఆ భూమిని తాము సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశామని అప్పటి నుంచి తమ అధీనంలోనే ఉందని స్వర్ణలతా రెడ్డి చెబుతున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీకి నిర్మాణాల నిమిత్తం అప్పచెప్పామని అయితే హఠాత్తుగా ఈ భూమి తమదని కొంత మంది వ్యక్తులు బోర్డులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కొండాపూర్ లో ఉన్న రెండు గుంటల స్థలంలోకి వైవీ సుబ్బారెడ్డితో పాటు కూకట్ పల్లి శివ అలియాస్ గ్యాంగ్ లీడర్ శివ తో పాటు పలువురు వ్యక్తులతో దౌర్జన్యంగా ప్రవేశించి తాము నిర్మించుకున్న గోడల్ని కూల్చివేశారని ఫిర్యాదుచేశారు. రెండు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన బంధువర్గమంతా హైదరాబాద్ మీద పడి చేయగలిగినన్ని భూదందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి ప్రతిచర్యలు బయటకు వస్తున్నాయి.