ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు నిర్వహించేవారు. ఆయన మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించారు. భారీగా సక్సెస్ అయిందని ప్రకటించారు. ఎవరికి ఉద్యోగాలొచ్చాయో.. ఎవరికీ తెలియదు. కానీ ఇదేదో లాభసాటి వ్యాపారంలాగా ఉందని అనుకున్నారేమో కానీ వైవీ సుబ్బారెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. విశాఖలో ఆయన కూడా జాబ్ మేళా పెట్టేశారు. అయితే విజయసాయిరెడ్డి పెట్టిన జాబ్ మేళా దెబ్బ రుచి చూసిన నిరుద్యోగులు .. వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఎంత గట్టిగా కొడతారోనని పెద్దగా అటు వైపు చూడలేదు.
కానీ కొంత మంది నిరుద్యోగులు మాత్రం.. తమను ఘోరంగా మోసం చేస్తున్నారని.. తోటి నిరుద్యోగుల్ని డబ్బులకు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ నిరనన చేపట్టారు. అసలు విషయం ఏమిటంటే జాబ్ మేళాకు వెళ్లాలంటే ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. విజయసాయిరెడ్డి నిర్వహించిన జాబ్ మేళాకు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. జాబ్ మేళాలో ఎంపికైన వారి దగ్గర కొన్ని కంపెనీలు.. ట్రైనింగ్ పేరుతో పాతిక నుంచి యాభై వేలు కట్టించుకుని మోసం చేశాయి. ఆ తర్వాత ఆ డేటాతో చాలా మంది నిరుద్యోగులకు మోసగాళ్లు ఫోన్ చేసి ఉద్యోగాల పేరుతో వల వేయడం ప్రారంభించారు. ఇలా ఇప్పటికి కొన్ని వందల మంది మోసపోయారు.
దీంతో వైవీ సుబ్బారెడ్డి మరోసారి ఇలా నిరుద్యోగులని మోసం చేసేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేశారని మండిపడుతూ నిరుద్యోగులు ధర్నా చేశారు. జాబ్ మేళాకు ఉద్యోగాల కోసం కూడా ఎవరూ రాలేదు. మోసం చేయడానికి సేవ ముసుగులో వస్తున్నారని.. ఒక్కటి కూడా మంచి కంపెనీ రాదని.. ప్రభుత్వం పేరుతో బెదిరిస్తే.. ఇంటర్యూలు నిర్వహించడానికి కొన్ని కంపెనీలు వస్తున్నాయని.. అవి కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా ఈ వైసీపీ కోఆర్డినేటర్లకు జాబ్ మేళాలపై అంత మక్కువ ఎందుకో ?