తిరుమల ప్రసాదం విషయలో కల్తీ చేసేందుకు బరి తెగించిన వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు బయటపెట్టడంతో నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ చేశారు. దేవుడిపై ఆయనకు ఏ మాత్రం భక్తి , భ యం ఉన్నా.. ఐదేళ్ల పాటు ఆ దేవదేవుడిని అడ్డం పెట్టుకుని ఆయనను మార్కెటింగ్ చేసుకుని రాజకీయాలు చేసేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రమాణం అంటూ ఆయన గుమ్మడికాయ దొంగ తరహాలో వచ్చేస్తున్నారు.
టీటీడీలో గత ఐదేళ్ల కాలంలో ప్రసాదం తయారీ నాణ్యతను దిగజార్చరనేది ప్రతి భక్తుడికి తెలుసు. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు.. అక్కడి సౌకర్యాలు ఇతర తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. క్యూలైన్లలో మంచి నీళ్లు ఇవ్వడం కూడా ఆపేశారు. ఇక ప్రసాదం తయారీకి క్వాలిటీ చెక్స్ కూడా ఆపేసి.. తమకు కావాల్సిన వారికి నాసిరకం.. నెయ్యి ఇతర పదార్థాలు సరఫరా చేసే వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును సరఫరా చేశారని అధికారులు నిర్దారించి.. సీఎంకు రిపోర్టు ఇచ్చారు. అదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు.
ఆ ల్యాబ్ శాంపిల్స్ సహా అన్నీ ఉంటాయి. అవన్నీ బయట పెట్టమని అడిగితే ఓ అర్థం ఉంటుంది కానీ.. ఇలా ప్రమాణాలు అంటూ అరిస్తే ప్రజలకు ఇంకా అనుమానాలు బలపడతాయి. ఐదేళ్ల పాటు శ్రీవారిని అత్యంత ఘోరంగా ఉపయోగించుకున్నారు. ప్రసాదాలతో కేసుల మాఫీకి ప్రయత్నాలు చేసుకున్నారు. టీటీడీ బోర్డులో సభ్యత్వం అంటూ.. న్యాయవ్యవస్థలోని వారికీ ఎర వేసిన ఆరోపణలు వచ్చాయి. ఇంత ఘోరంగా.. టీటీడీని భ్రష్టుపట్టించిన సుబ్బారెడ్డి గ్యాంగ్.. ఇప్పుడు నిజాలు బయట పెడుతూంటే.. ఉలిక్కి పడుతున్నారు.