విజయసాయిరెడ్డి పాత్రను భర్తీ చేయడానికి రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బయట లాబీయింగ్ లో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి పనులు కొన్ని చేసేవారు. అప్పట్లో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఉపయోగపడేది. ఇప్పుడు ఆయన ఎంపీ మాత్రమే. పైగా విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి లోటును పూర్తిగా భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
లాబీయింగ్ల సంగతేమోకానీ పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి తరహాలో మాట్లాడటానికి వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. సాక్షి ఆఫీసు నుంచి వచ్చిన పేపర్లను పార్లమెంట్ లో చదవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాజ్యసభ వైస్ చైర్మన్ ఆయన ప్రసంగాన్ని విని విస్తుపోయారు. అంత పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నారని..దానికి సాక్ష్యాలను చూపించకపోతే స్పీచ్ ను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పినా ఆయన ప్రసంగం అలాగే కొనసాగించారు. గతంలో విజయసాయిరెడ్డి కూడా అదే పని చేసేవారు. ఇవేం మాటలని ఎవరు అన్నా ఆయన పట్టించుకునేవారు కాదు. వైవీ సుబ్బారెడ్డి కూడా అలా చేయాలనుకుంటున్నారు.
నిజానికి సుబ్బారెడ్డి ప్రసంగంలో అన్ని రాష్ట్ర అంశాలే ఉన్నాయి. అవన్నీ అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంది. అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ కు దైర్యం చాలడం లేదు. కానీ పార్లమెంట్ లో మాత్రం చదివేస్తున్నారు. రికార్డుల నుంచి తొలగించుకుంటే తొలగించుకోండా.. తాము మాట్లాడాల్సింది మాట్లాడతామంటున్నారు. విజయసాయిరెడ్డి లేకపోవడం వల్ల లోటేమీ లేదని నిరూపించే ప్రయత్నంలో వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు బిజీగా ఉన్నారు.